పనితీరు బాగుంటేనే ‘క్రమబద్ధీకరణ’ | Sakshi
Sakshi News home page

పనితీరు బాగుంటేనే ‘క్రమబద్ధీకరణ’

Published Mon, Dec 14 2015 3:17 AM

పనితీరు బాగుంటేనే ‘క్రమబద్ధీకరణ’ - Sakshi

♦ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కొత్త మలుపు
♦ పర్యాటకాభివృద్ధి సంస్థపై ప్రత్యేక దృష్టి
♦ ఈ విభాగాన్ని శాసిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు
♦ అవినీతి ఆరోపణలున్న సిబ్బందిపై ప్రభుత్వం సీరియస్
 
 సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ అంశం కొత్త మలుపు తిరిగింది. మొత్తం ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పనితీరు ఆధారంగా కాంట్రాక్టు సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. దీనికి సంబంధించి వారి పనితీరు నివేదికలను ఆయా విభాగాధిపతుల నుంచి సేకరిస్తోంది. ముఖ్యంగా పర్యాటక శాఖలాంటి చోట్ల దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ శాఖ పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగుల ఆధ్వర్యలోనే నడుస్తోంది. ముఖ్యంగా ఈ శాఖ పరిధిలోకి వచ్చే పర్యాటకాభివృద్ధి సంస్థ పూర్తిగా వారి చెప్పుచేతల్లో నడుస్తోంది.

గతంలో అడ్డదిడ్డంగా ఉద్యోగాలు పొందిన పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సంస్థ కార్యకలాపాలను నిర్వీర్యం చేశారు. కిందిస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా ఉన్నతాధికారుల పోస్టుల్లో కూడా కాంట్రాక్టు సిబ్బందే పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కేవలం జేబులు నింపుకొనేందుకే పరిమితం కావటంతో కొంతకాలంగా పర్యాటకాభివృద్ధి సంస్థ పనితీరు దిగదుడుపుగా మారింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో అలాంటి వారి పనితీరుపై నివేదికలు సేకరిస్తున్న ప్రభుత్వం... సిబ్బంది పనితీరును పరిగణనలోకి తీసుకునే వారి సర్వీసుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.

పనితీరు సరిగా లేని వారిని విధుల నుంచి తొలగించటంతోపాటు అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించటం విశేషం. దీన్ని కేవలం పర్యాటక శాఖకే పరిమితం చేయకుండా ఇతర విభాగాలలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ప్రభుత్వ ఉద్యోగులు 97 మంది ఉంటే కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు మూడొందల మంది ఉన్నారు. అంతే సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా చాలాకాలంగా కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే సంఘం పేరుతో కొందరు సిబ్బంది నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఇక తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టు సిబ్బందికి ఎడాపెడా పోస్టులు కేటాయిస్తూ కొందరు ఉన్నతాధికారులు కార్పొరేషన్‌ను అస్తవ్యస్తంగా మార్చారు. కార్పొరేషన్‌లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగికి గతంలో ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్సార్ నిథిమ్ బాధ్యతలు అప్పగించారు. అది కాకుండా ఆ అధికారికి మరో మూడు పోస్టులు ఇన్‌చార్జి హోదాలో ఉన్నాయి. వాటిని అడ్డుపెట్టుకుని నిధులు స్వాహా చేశారని తీవ్ర ఆరోపణలున్నాయి.

మరోవైపు నిథిమ్ పూర్తి అస్తవ్యస్తంగా మారింది. అక్కడి పరిస్థితులు నచ్చక కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు మానేశారని, వేరే రాష్ట్రాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడా కాంట్రాక్టు ఉద్యోగి  ఆ సంస్థ డైరక్టర్ పోస్టుకోసం పైరవీలో ఉన్నారని సమాచారం. తాజాగా ప్రభుత్వం వారి సర్వీసు క్రమబద్ధీకరణలో పనితీరును కొలబద్ధగా తీసుకోవటంతో అవినీతి సిబ్బందిలో ఆందోళన మొదలైంది. క్రమబద్ధీకరణ జాబితాలో తమ పేరుండేలా రాజకీయ పార్టీ నేతలతో ఒత్తిళ్లు ప్రారంభించారని తెలుస్తోంది.
 
 తెలంగాణేతరులపై ఆరా...
 పర్యాటకశాఖలో పనిచేస్తున్న తెలంగాణేతరుల పనితీరుపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆ శాఖ మంత్రి చందూలాల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న తెలంగాణేతరుల పనితీరుపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణేతరుల సంఖ్య అధికంగా ఉన్నందున వారి పనితీరును సమీక్షించి.. కొనసాగించాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement