ఐఐటీల్లో ప్రవేశాల షెడ్యూలు జారీ | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో ప్రవేశాల షెడ్యూలు జారీ

Published Tue, Jul 12 2016 4:04 AM

ఐఐటీల్లో ప్రవేశాల షెడ్యూలు జారీ

- ఒక్కో ఐఐటీలో ఒక్కో తేదీలో తరగతులు ప్రారంభం
- సీట్ రద్దు చేసుకున్న వారికి 20వ తేదీ నుంచి ఫీజు వెనక్కి
 
 సాక్షి, హైదరాబాద్ : జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్యర్యంలో ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరాల్సిన ప్రవేశాల షెడ్యూలు సోమవారం విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 22 నుంచి 26 తేదీల మధ్య ఆయా కాలేజీల్లో చేరాలని జోసా స్పష్టం చేసింది. సీట్లు రద్దు చేసుకున్న విద్యార్థులకు 20వ తేదీ నుంచి ఫీజు వెనక్కి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, యాక్సెప్టెన్సీ ఇచ్చిన విద్యార్థులు కచ్చితంగా ఆయా కాలేజీల్లో నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, రిపోర్టు చేయాలని పేర్కొంది.

ఐఐటీల వారీగా తరగతుల ప్రారంభ తేదీలను వెల్లడించింది. అలాగే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను తెలిపింది. సీటు యాక్సెప్టెన్సీ ఫీజు పోగా, కేటగిరీ, రిజర్వేషన్ల వారీగా విద్యార్థులు మొదటి సెమిస్టర్‌లో చెల్లించాల్సిన కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజులు, ఆలస్య రుసుముతో చెల్లించాల్సిన వివరాలను ఆయా ఐఐటీల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లోనూ ఆ వివరాలను, ప్రవేశాల షెడ్యూల్‌ను పొందుపరిచింది. బిలాయ్, భువనేశ్వర్, ధార్వాడ్, గోవా, హైదరాబాద్, ఇండోర్, జమ్మూ, జోధ్‌పూర్, కాన్పూర్, పలక్కడ్, రోపర్, తిరుపతి, ధన్‌బాద్ తదితర ఐఐటీల రిజిస్ట్రేషన్ తేదీలు, రిపోర్టు చేయాల్సిన తేదీలు, తరగతుల ప్రారంభ తేదీలను ఆయా ఐఐటీల వెబ్‌సైట్‌లలో పొందవచ్చని పేర్కొంది. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, కాలేజీల్లో చేరాలని వివరించింది.

 14, 17, 19 తేదీల్లో మరో 3 దశల సీట్లు కేటాయింపు
 జూన్ 30న మొదటి దశ, ఈ నెల 6న రెండో దశ సీట్లు కేటాయించిన జోసా.. మూడో దశ సీట్ల కేటాయింపును ఈ నెల 10న ప్రకటించింది. అందులో సీట్లు లభించిన విద్యార్థుల నుంచి సీట్ల యాక్సెప్టెన్సీ, విత్‌డ్రాకు 11 నుంచి 13వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇక 14న నాలుగో దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. 15, 16 తేదీల్లో యాక్సెప్టెన్సీ, విత్‌డ్రాకు అవకాశం కల్పించనుంది. 17న ఐదో దశ సీట్ల కేటాయింపును ప్రకటించి.. 18న యాక్సెప్టెన్సీ, విత్‌డ్రాకు అవకాశం కల్పించనుంది. 19న ఆరో దశ సీట్ల కేటాయింపును ప్రకటించి.. 20న సీట్ల యాక్సెప్టెన్సీకి అవకాశం కల్పించనుంది. దీంతో ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ముగియనుంది. ఆ తర్వాత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement