బాలికా విద్యకు ప్రాధాన్యం! | Sakshi
Sakshi News home page

బాలికా విద్యకు ప్రాధాన్యం!

Published Mon, Feb 22 2016 4:25 AM

బాలికా విద్యకు ప్రాధాన్యం!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా విద్యా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బాలికలకు సంబంధించి ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయించింది. వ చ్చే విద్యా సంవత్సరంలో (2016-17) బాలికల డ్రాపౌట్ల సంఖ్య తగ్గించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం పెంచేలా కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని బాలికల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కార్యాచరణపై దృష్టి సారిం చింది. బాలికల కోసం నిర్మించిన టాయిలెట్లలో నీటి వసతి కలిగి ఉండేలా పక్కాగా చర్యలు చేపట్టడంతో పాటు వారి కోసం స్కూళ్లలో రెస్ట్ రూమ్‌లను నిర్మించాలని నిర్ణయించింది.

 పారిశుధ్య లోపమూ కారణమే!
 ప్రస్తుతం రాష్ట్రంలో 4,563 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో చదివే బాలికలకు పారిశుధ్యం, ప్రత్యేక టాయిలెట్ వంటి సమస్యలు తప్పడం లేదు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఈ కారణాల వల్ల కొందరు బాలికలు బడి మానేస్తున్న విషయాన్ని విద్యా శాఖ గుర్తించింది. ఇప్పటికే ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. అలాగే బాలికల కోసం అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో రెస్ట్ రూమ్‌లను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒక్కో గదికి రూ.10 లక్షల చొప్పున వెచ్చించి, ప్రతి జిల్లాలోని 5 నుంచి 10 ఉన్నత పాఠశాలల్లో వీటిని నిర్మించనున్నారు. మరోవైపు బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు 1,836 ఉన్నత పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది.

 డ్రాపౌట్లను తగ్గించే చర్యలు
 రాష్ట్రంలో బాలికల డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది.  బాలికలను చదివించేందుకు తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండటాన్ని విద్యా శాఖ గుర్తించింది. అందుకే విద్య పరంగా వెనుకబడ్డ మండలాల్లో బాలికల కోసం మోడల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టింది. 182 మోడల్ స్కూళ్లలో 100 వరకు బాలికల హాస్టళ్లను గతంలోనే ప్రారంభించింది. మిగిలిన హాస్టళ్లను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని నిర్ణయించింది. వీటికి తోడు మోడల్ స్కూల్స్ ఫేజ్-2లో మరో 125 మోడల్ స్కూళ్లలో 125 బాలికల హాస్టళ్లు మంజూరయ్యాయి. అయితే కేంద్రం ఆ పథకాన్ని రద్దు చేయడంతో వాటిని గురుకుల విద్యాలయాలుగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Advertisement
Advertisement