రక్తనిధి ఖాళీ.. | Sakshi
Sakshi News home page

రక్తనిధి ఖాళీ..

Published Thu, Apr 28 2016 2:16 AM

రక్తనిధి ఖాళీ.. - Sakshi

ఎండలు..వేసవి సెలవుల ఎఫెక్ట్
ఐపీఎం సహా అంతటా నిండుకున్న రక్తం నిల్వలు
అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క రోగులకు తప్పని ఇబ్బంది
 

 
సాక్షి, సిటీబ్యూరో
రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఆపదలో రక్తనిధి కేంద్రానికి వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. సకాలంలో అవసరమైన బ్లడ్‌గ్రూప్ దొరక్క క్షతగాత్రులు, గర్భిణులు, తలసీమియా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో తీవ్రంగా ఉండటంతో త్వరగా నీరసించే ప్రమాదం ఉంది. దీనికి తోడు కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఐపీఎం సహా రెడ్‌క్రాస్ సొసైటీ, వైఎంసీఏ, లయన్స్ క్లబ్ వంటి స్వచ్చంధ సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో రక్త నిల్వలు నిండుకోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.


క్షతగాత్రులకు ప్రాణగండం
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కేర్, యశోద, కామినేని, కిమ్స్ వంటి ఆసుపత్రులకు ఎక్కువగా తీసుకువస్తారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న వారిని సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి శస్త్రచికిత్సల సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో రక్తనిధి కేంద్రాలకు వెలితే స్టాకు లేదని తిప్పిపంపతున్నారు. ఒక వే ళ ఉన్నా..బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు ర క్తదానం చేస్తేకానీ అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెలిక పెడుతున్నారు.

సకాలంలో రక్తం దొరకకపోవడంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు వాయిదా పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోకపోగా, కొందరు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు, కార్పొరేట్ ఆస్పత్రులు దాతల నుంచి సేకరించిన రక్తాన్ని రూ.1500-2500 వరకు విక్రయిస్తుండటం గమనార్హం.


 బాధితులకు అవస్థలు: అలీంబేగ్, సంయుక్త కార్యదర్శి, తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ
నగరంలో సుమారు మూడు వేల మంది తలసీమియా బాధితులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రతి 15-20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రోజుకు 30-40 యూనిట్ల రక్తం అవసరం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే..ఎండకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదు. రోగులకు రక్తం సరఫరా చేయడం మాకు చాలా కష్టంగా మారింది. గత్యంతరం లేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని కొనుగోలు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement