విధివంచితులు..! | Sakshi
Sakshi News home page

విధివంచితులు..!

Published Thu, May 5 2016 1:58 AM

విధివంచితులు..! - Sakshi

పేదరికానికి పెద్ద కష్టాలు
కుప్పకూలుతున్న చిన్నారులు
సహాయం కోసం ఎదురుచూపు

 
సాక్షి, సిటీబ్యూరో: అసలే నిరుపేదలు, ఆపై విధి వారిపై చిన్నచూపు చూసింది. లక్షమందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఆరుదైన కండరాల క్షీణత(మస్కులర్ డిస్క్రోపి)తో వారిని మంచానికి, కుర్చీకి కట్టిపడేసింది. వారిని కాపాడుకునేందుకు ఆ నిరుపేదల దళిత తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి.. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా వేణువంక మండల పోతిరెడ్డిపల్లికి చెందిన నందిపాట సమ్మయ్య- కరుణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. వారికి ఉన్న 20 కుంటల పొలాన్ని సాగు చేస్తూ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివించేవాడు. వీరిలో పెద్దబ్బాయి ప్రణయ్(16), ఏడవ తరగతి, చిన్నబ్బాయి  వినయ్(13) ఆరో తరగతి చదువుతున్నారు.  ఇద్దరు కుమారులు స్కూల్‌కు వెళ్లి వస్తుంటే చూసి ఆ దంపతులు మురిపోయేవారు.

అయితే 11 ఏళ్ల వయసులో వారు ఇద్దరూ నడుస్తూ నడుస్తూనే కుప్పకులిపోతుండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వారిని హన్మకొండ, హైదరాబాద్ నిమ్స్, మహారాష్ట్రలో వైద్యం చేయించారు. అందుకుగాను తమ పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా జబ్బు నయం కాకపోవడంతో జమ్మికుంటకు వలసవచ్చి కూలీ పనిచేస్తూ పైసలు పొగవ్వగానే ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారు. దీంతో ఉన్న ఉపాధి కూడా పోవడంతో అదే గ్రామంలో టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఎంద రు వైద్యులను సంప్రదించినా ఈ వ్యాధికి మందు లేద ని, అంతవరకు పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వాలని సూచించడంతో బిడ్డల కడుపు నింపేందుకు ఆ అన్నదాత అందరి వద్ద చేయి చాస్తున్నాడు.


 పూట గడవడం లేదు...
డాక్టర్లు జబ్బు నాయం కాదు. మందులు లేవు. జీవి తాంతం ఇంతే. రోజు ఇద్దరికి పండ్లు- ఫలాలు అంది వ్వు. అప్పుడైనా కొంతవరకు నయమౌతుందేమో చూ ద్దాం అని చెప్పారని పిల్లల తండ్రి సమ్మయ్య అన్నారు.టీ అమ్మి కుటుంబాన్ని పోషించే తనకు వారికి వైద్యం చేయించేందుకు చిల్లి గవ్వలేదని వాపోయాడు. మానవతా హృదయులు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన బిడ్డలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సహాయం చేయాలనుకున్న వారు 9704964049 సెల్ ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement