భారత జనవాణి..ఆకాశవాణి | Sakshi
Sakshi News home page

భారత జనవాణి..ఆకాశవాణి

Published Fri, Jan 10 2014 4:55 AM

Indian janavani .. Radio

  •  ప్రశంసించిన గవర్నర్  
  •  సమైక్యతను చాటిన సాహిత్యోత్సవం
  •  కోలాహలంగా జాతీయ కవి సమ్మేళనం
  •  తరలివచ్చిన అనేకమంది కవులు
  •  
    సాక్షి,సిటీబ్యూరో: జాతి సమైక్యతను, దేశభక్తిని, సౌభ్రాతృత్వాన్ని చాటుతూ వివిధభాషల్లో కవులు వినిపించిన కవితలు అద్భుతంగా,స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. తమ కవితల్లో మొత్తం దేశాన్ని ప్రతిబింబించారని, ఇది అరుదైన సందర్భమని ప్రస్తుతించారు. ఆలిండియో రేడియో, ఆకాశవాణి డెరైక్టర్ జనరల్ గురువారం ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన ‘జాతీయ కవిసమ్మేళనం-2014’ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 22 భారతీయ భాషల్లోని సుప్రసిద్ధ కవులు,22 మంది హిందీ,మరో 22 మంది తెలుగు అనువాదకవులతో నగరంలో తొలిసారి ఏర్పాటుచేసిన జాతీయ కవి సమ్మేళనం సాహిత్యోత్సవాన్ని తలపించింది. గవర్నర్ మాట్లాడుతూ..

    దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన అగ్రశ్రేణి కవులు హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సమాచార సాంకేతిక విప్లవం ఫలితంగా వందలకొద్దీ చానళ్లు, ఎఫ్‌ఎం రేడియోలు రాజ్యమేలుతున్నప్పటికీ ఆకాశవాణి తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉందన్నారు. ఆకాశవాణి గొప్ప విశ్వసనీయతను కలిగివుందని, ఇప్పటికీ కచ్చితమైన సమయం తెలుసుకోవాలంటే  రేడియో వినాల్సిందేనని గుర్తుచేశారు. ఆకాశవాణి భారత జనవాణి అని కొనియాడారు.

    ఈ సందర్భంగా ఆకాశవాణి డిఫ్యూటీ డెరైక్టర్ జనరల్ ఆదిత్యప్రసాద్ గవర్నర్‌కు రేడియోసెట్‌ను బహూకరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆలిండియా రేడియో డెరైక్టర్ జనరల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక మార్పునకు రేడియో ఎంతో కృషిచేస్తోందన్నారు. అంతకుముందు కవిసమ్మేళనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖకవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె మాట్లాడుతూ ఆకాశవాణి ఇలాంటి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం ఎంతో మంచి సంప్రదామంటూ..ఇంతమంది కవులను ఒక్కచోట చూస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
     
    వైవిధ్యభరిత కవనం: ప్రముఖ సంస్కృత కవి ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి సంస్కృతంలో రాసిన ‘కేదార విలయ తాండవం’ కవితతో  మొదలైన కవి సమ్మేళనం 22 భాషల్లో సుదీర్ఘంగా సాగింది. ఆయా కవితలనుహిందీలోకి అనువదించేందుకు 22 మంది హిందీకవులు, తెలుగులోకి అనువదించేందుకు మరో 22 మంది తెలుగుకవులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement