సాగుపై శీతకన్ను | Sakshi
Sakshi News home page

సాగుపై శీతకన్ను

Published Tue, Mar 15 2016 2:21 AM

సాగుపై శీతకన్ను - Sakshi

ఏకమొత్తంగా రుణమాఫీ లేనట్లే!
* ఇన్‌పుట్ సబ్సిడీకి నిధులు కరువు
* పాడి ప్రోత్సాహకంపై నీళ్లు... బడ్జెట్లో నిధులు కేటాయించని వైనం
* పావలా వడ్డీ పంట రుణాల పథకం ఎత్తివేత!.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.6,759కోట్లు

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఒకవైపు కరువు, మరోవైపు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా... సాగుకు బడ్జెట్ కేటాయింపులపై నిర్లక్ష్యం చూపింది. కరువులో ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను ప్రకటించకపోవడంపై, రైతు ఆత్మహత్యల నివారణకు నిధిని ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతేడాది ఖరీఫ్ పంట నష్టాన్ని ఆధారం చేసుకొని రాష్ట్రంలో 231 కరువు మండలాలను ప్రకటించారు. రైతు సంఘాల లెక్కల ప్రకారం దాదాపు 1,800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ బడ్జెట్లో నిధుల కేటాయింపులు మాత్రం పెరగలేదు. టీఆర్‌ఎస్ సర్కారు ప్రధాన హామీ అయిన రుణమాఫీపైనా సర్కారు శీతకన్ను వేసింది. రుణమాఫీలోని మొత్తం నాలుగు విడతల్లో రెండు విడతల సొమ్మును బ్యాంకులకు చెల్లించాల్సి ఉన్నా... ఒక వాయిదా మాత్రమే చెల్లిస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ఇందుకోసం ప్రణాళికేతర బడ్జెట్లో రూ.4,250కోట్లు చూపింది.

ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును పూర్తిగా చెల్లించకపోవడంతో ఇప్పటికే బ్యాంకులు రుణాలివ్వక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరిన్ని సమస్యలు తప్పేలా లేవు. ఇక పాడి రైతులకు ఇస్తున్న లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం గమనార్హం. పశుసంవర్థకశాఖ అధికారులు దీనికోసం రూ.109 కోట్లు కావాలని కోరినా మొండిచెయ్యి చూపారు. అంటే పాడి ప్రోత్సాహకాన్ని ఎత్తేస్తారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
పాలిహౌస్‌కు తగ్గిన నిధులు
2016-17 బడ్జెట్లో వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్ తదితర అనుబంధ రంగాలకు రూ.6,758.53 కోట్లు కేటాయించింది. అందులో ప్రణాళిక బడ్జెట్ రూ.1,821.24 కోట్లు. పశు సంవర్థక, మత్స్యశాఖలకు రూ.647.64 కోట్లు కేటాయించగా.. అందులో ప్రణాళిక బడ్జెట్ రూ.247.56 కోట్లుగా చూపారు. మొత్తంగా వ్యవసాయశాఖ ప్రణాళికేతర బడ్జెట్లో రూ.4,250 కోట్లను రైతుల రుణమాఫీ కోసం కేటాయించడం గమనార్హం.

ప్రభుత్వం రుణమాఫీలో మొత్తం నాలుగు విడతలకు గాను ఇప్పటివరకు రెండు విడతలు నిధులు చెల్లించింది. ఇది మూడో విడత కానుంది. ఇక పాలిహౌస్ సాగుకు 75 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు గత బడ్జెట్‌లో రూ.250 కోట్లు ఇవ్వగా... ఈ బడ్జెట్లో రూ.199.50కోట్లను మాత్రమే ప్రతిపాదించారు. ఇందులో ఎస్సీ రైతులకు రూ.30.90కోట్లు, ఎస్టీ రైతులకు రూ.18.16కోట్లు కేటాయించారు. 600 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తామని... మొత్తంగా వెయ్యి ఎకరాలకు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు.

మార్కెట్‌లో ధరల స్థిరీకరణ కోసం గత బడ్జెట్లో రూ.75కోట్లు కేటాయించిన ప్రభుత్వం... ఈసారి ఒక్క పైసా కేటాయించలేదు. వ్యవసాయ యాంత్రీకరణకు మాత్రం రూ.250కోట్లు చూపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొనే పంట కాలనీలు, భూమి, నీటి విశ్లేషణకు ఒక్కపైసా కేటాయించకపోవడం గమనార్హం. పావలా వడ్డీ పంట రుణాల పథకానికీ నిధులివ్వలేదు. ప్రాథమిక సహకార సంఘాల (పాక్స్)కు సాయం చేసేందుకు కొత్తగా పథకాన్ని ఏర్పాటు చేసి, రూ.14.95 కోట్లు కేటాయించారు.
 
వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు
చిన్న, సన్నకారు రైతులకు పంటల బీమా ప్రీమియంలో సాయానికి రూ.134 కోట్లు
రైతులకు విత్తనాల సరఫరాకు రూ.60.33కోట్లు, సీడ్‌చైన్ పథకాన్ని బలోపేతం చేసేందుకు రూ.33.80కోట్లు
కేంద్ర సహకారంతో నిర్వహించే పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకానికి రూ.4.75 కోట్లు
సూక్ష్మ సేద్యానికి రూ.140కోట్లు
జాతీయ ఉద్యాన ప్రాజెక్టుకు 70 కోట్లు
క్షేత్రస్థాయి వెటర్నరీ సంస్థలకు మౌలిక సదుపాయాల కోసం రూ.54.96 కోట్లు
గడ్డి, దాణా అభివృద్ధి కోసం 13.50 కోట్లు
వెటర్నరీ సేవలకు రూ.28.37 కోట్లు
జంతువులు, కోళ్ల ఉత్పత్తి ప్రోత్సాహకానికి రూ.21.06 కోట్లు
మత్స్యశాఖ అభివృద్ధికి రూ.70.15 కోట్లు
చేప విత్తన క్షేత్రాల కోసం రూ.29 కోట్లు
‘చుక్కనీటితో ఎక్కువ పంట’ కోసం రూ.112 కోట్లుర
 
కరువు సాయమేదీ?: రైతు సంఘాలు
బడ్జెట్లో ప్రభుత్వం కరువు సాయం కోసం నిధులు కేటాయించలేదని అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. రుణమాఫీకి కేటాయించిన ప్రణాళికేతర బడ్జెట్ కేటాయింపులు తీసేస్తే ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం 1.8 శాతమే కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. పాడి రైతులకు లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. ఆ పథకాన్ని ఎత్తేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement