కాలేజీల తనిఖీ నివేదికల్లో తేడాలు! | Sakshi
Sakshi News home page

కాలేజీల తనిఖీ నివేదికల్లో తేడాలు!

Published Thu, Jun 23 2016 3:14 AM

Inspection report colleges differences!

- జేఎన్‌టీయూహెచ్ - విజిలెన్స్ తనిఖీల మధ్య భారీగా వ్యత్యాసాలు
- మూడు కేటగిరీలుగా కాలేజీల విభజనకు ప్రభుత్వ ఆదేశాలు
- నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపునకు కసరత్తు!
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్షలో నిర్ణయం
- ఫీజుల నిర్ణయంపై ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశం 29కి వాయిదా
- ఫలితంగా వెబ్ ఆప్షన్లు, ప్రవేశాల్లో తప్పని ఆలస్యం
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో వసతులు, ఫ్యాకల్టీ తదితర అంశాల్లో ఇటు జేఎన్‌టీయూహెచ్, అటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేపట్టిన తనిఖీల  మధ్య అనేక తేడాలు వెల్లడయ్యాయి. జేఎన్‌టీయూ చేపట్టిన తనిఖీల సందర్భంగా కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడి కాగా, విజిలెన్స్ తనిఖీల సందర్భంగా మరిన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. జేఎన్‌టీయూహెచ్ లోపాలు లేవని భావించిన కొన్ని కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీల సందర్భంగా లోపాలు బయట పడ్డాయి. ఇక విజిలెన్స్ విభాగం లోపాలు లేవని నివేదికలు రూపొందించిన కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు జేఎన్‌టీయూహెచ్ చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తం 247 ఇంజనీరింగ్ కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

జేఎన్‌టీయూహెచ్ లోపాలు ఉన్నట్లు తేల్చిన కాలేజీలు, లోపాలు లేవని తేల్చిన కాలేజీలతో ఒక నివేదిక, విజిలెన్స్ విభాగం లోపాలు ఉన ్నట్లు తేల్చిన కాలేజీలు, లోపాలు లేవని తేల్చిన కాలేజీలతో మరో నివేదిక, రెండు విభాగాల నివేదికల మధ్య తేడాలు కలిగిన (ఒక దాంట్లో లోపాలు ఉన్నవి, మరోదాంట్లో లోపాలు లేనిని, ఒకదాంట్లో బాగున్నవి, మరొక దాంట్లో బాగా లేవని తేల్చినవి) కాలేజీల జాబితాతో కూడిన ఇంకో నివేదిను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జేఎన్‌టీయూహెచ్‌ను ఆదేశించారు. ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు, కాలేజీల తనిఖీల వ్యవహారంపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు కేటగిరీలుగా కాలేజీలను విభజించాక తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తానికి ఈ నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చేలా కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారం బుధవారం ఓ కొలిక్కి వస్తుందని భావించినా అది సాధ్యం కాలేదు. త్వరలోనే మరోసారి సమావేశమై తేల్చే అవకాశం ఉంది.
 
 ఎటూ తేలని ఫీజుల వ్యవహారం
 మరోవైపు బుధవారం జరిగిన ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో వచ్చే మూడేళ్లపాటు వసూలు చేసే ఫీజుల ఖరారు వ్యవహారం ఎటూ తేలలేదు. పలు అంశాలపై స్పష్టత రాక.. ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఈ నెలాఖరులోగా ఫీజులు  ఖరారు అవుతాయని భావించినా అది సాధ్యం అయ్యేలా లేదు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు, ఫీజులు ఖరారు అయితేనే ప్రవేశాలు చేపట్టే కాలేజీల జాబితాను విద్యార్థులకు అందుబాటులోకి తేవడం సాధ్యం. ఈ నేపథ్యంలో వెబ్ ఆప్షన్లు, ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఆలస్యం తప్పేలా లేదు.

Advertisement
Advertisement