Sakshi News home page

బీ‘టఫ్’

Published Sat, Aug 17 2013 1:53 AM

బీ‘టఫ్’ - Sakshi

 ఇంటర్ బ్రిలియంట్స్... ఎంసెట్ టాపర్స్... ఇంజనీరింగ్‌లో మాత్రం ఫెయిల్. ఇటీవల విడుదలైన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు చెబుతున్న చేదు నిజమిది. ఈ తీరుకు కారణాలేంటి? దీనికి పరిష్కారాలేంటి?  ‘సాక్షి ’ విశ్లేషణాత్మక కథనం...
 
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 289 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, వీటిలో చదువుతున్న విద్యార్థులు 2.5 లక్షలకు పైమాటే. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70,872 మంది. వీరంతా గతేడాది ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి వివిధ సాంకేతిక కోర్సుల్లో అడుగిడినవారే. ప్రతిభావంతులైన ఈ విద్యార్థులు గత మేలో జరిగిన ఇంజనీరింగ్ వార్షిక పరీక్షల్లో మాత్రం గుడ్లు తేలేశారు. జేఎన్టీయూహెచ్ గతవారం విడుదల చేసిన ఫలితాల ప్రకారం మొదటి సంవత్సరం ఉత్తీర్ణత (34.59 శాతమే) పాస్ మార్కులు కూడా దాటలేదు. ఈ తీరుకు కారణాలేంటని పరిశీలిస్తే ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా  సిబ్బంది లేకపోవడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తోంటే.. విద్యార్థులకు ఇంటర్ తర్వాత విపరీతమైన స్వేచ్ఛ లభించడమే కారణమేనని ఆచార్యులు అంటున్నారు. విద్యార్థులు మాత్రం తాము పరీక్షలు బాగానే రాస్తున్నామని, మార్కులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 తల్లిదండ్రుల్లో ఆందోళన
 ఇంజినీరింగ్ ఫస్టియర్ ఫలితాలను చూసి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రతియేటా మార్చినెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయినప్పటి  నుంచి ఇంజినీరింగ్‌లో చేరేవరకు సుమారు ఐదు నెలల పాటు విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరమవడం, ఇంటర్ వరకు తమ పిల్లల చదువు పట్ల ఎంతో శ్రద్ధ చూపే తల్లిదండ్రులు, బీటెక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులను అంతగా పట్టించుకోకపోవడమే దీనికి కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. ఇంటికి సమీపంలోని జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇంటర్ పుస్తకాలను గంటల కొద్దీ బట్టీలు కొట్టేవారని... ప్రస్తుతం నగరానికి దూరంగా ఉండే ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరడం వల్ల గంటల కొద్దీ సమయం బస్సుల్లోనే గడుపుతుండటం వల్ల చదువుకు ఇబ్బందవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. దానికితోడు ఇంజినీరింగ్ విద్యార్థులకు లభిస్తోన్న విపరీతమైన స్వేచ్ఛ.. వారి వార్షిక పరీక్షా ఫలితాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.
 
 ఇంజనీరింగ్ సిలబస్ విభిన్నం
 టెన్త్, ఇంటర్‌లతో పోలిస్తే ఇంజనీరింగ్ సిలబస్ విభిన్నంగా ఉంటుంది. బీటెక్‌లో అపరిమితమైన సిలబస్ ఉండడంతో విద్యార్థులు భారంగా భావిస్తారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల  నుంచి వచ్చే విద్యార్థులు ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారడం, నివాస ప్రాంతాలకు కళాశాలలు దూరంగా ఉండడం, సీనియర్స్ నుంచి ర్యాగింగ్.. తదితర అంశాలు కూడా ఫస్టియర్ విద్యార్థులకు ప్రతిబంధకాలుగా మారతాయి. మరో ముఖ్యమైన విషయమేమంటే.. ఎక్కువ శాతం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థులకు సీనియర్ ఫ్యాకల్టీ  లేకపోవడం వల్ల విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని కనబర్చడం లేదు. ఫస్టియర్‌లో వార్షిక పరీక్షలకు ఎక్కువ సబ్జెక్టులు ఒకేసారి రాయాల్సి రావడం కూడా ఉత్తీర్ణత తగ్గడానికి మరో కార ణం.
 - ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్‌కుమార్, మెకానికల్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్
 
 ఆకర్షణల వలయంలో ఉక్కిరిబిక్కిరి
 ఇంటర్ వరకు స్వేచ్ఛ లేకుండా చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో చేరగానే జైలు నుంచి బయటకు వచ్చినట్లు ఫీలవుతారు. సహజంగానే ఈ వయసులో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా ఎన్నో ఆకర్షణ (స్మార్ట్ ఫోన్లు, బైక్‌లు, వెరైటీ దుస్తులు.. తదితరాలు)లకు లోనవుతారు. అదేవిధంగా ఇంటర్ వరకు విద్యార్థిని కంటికి రెప్పలా అంటిపెట్టుకునే తల్లిదండ్రులు.. తమ పిల్లాడు ఇంజనీరింగ్‌లో చేరాక నాలుగేళ్లపాటు ఇట్టే వదిలేస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువు మందగిస్తుంది. పరీక్షలు రాసేందుకు 70 శాతం హాజరు ఉంటే చాలని యూనివర్సిటీ అధికారులు నిర్దేశించడం విడ్డూరమే. అంటే..  ఎటువంటి వైద్య కారణాలు లేకున్నా 30 శాతం తరగతులు ఎగ్గొట్టమని చె ప్పినట్లవుతోంది. 90శాతం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థులకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే బోధిస్తున్నారు. టెన్త్, ఇంటర్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధిస్తుంటే చక్కగా వినే విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్ చెప్పే తరగతులు బోర్ కొట్టించక మానవు. బ్యాక్‌లాగ్‌లు ఉంటే నాలుగేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేయవచ్చులేనన్న భావనతో కూడా విద్యార్థులు ఫస్టియర్ పరీక్షల పట్ల శ్రద్ధ కనబర్చడం లేదని తెలుస్తోంది.    
 - గంపా నాగేశ్వరరావు, సైక్రియాటిస్ట్
 
 ఐదారు కోర్సులకే ఆదరణ..
 బీటెక్‌లో పేరుకు 30 ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నా.. ఎక్కువమంది విద్యార్థులు చేరుతోంది ప్రధానంగా ఐదారు కోర్సుల్లోనే. గత ఐదేళ్లుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌దే ఆధిపత్యం కొనసాగుతుండగా, ఐటీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రమే. గతేడాది(2012-13) ఈసీఈ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు వరుసగా.. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లోనే చేరారు. మిగిలిన 24 కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఏ కోర్సులోనూ వెయ్యి దాటలేదు. కొన్ని కోర్సుల్లోనైతే ఆ సంఖ్య 100కి లోపే. ఫలితాలను పరిశీలిస్తే.. ఈసీఈలో 41.96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత కేవలం 22.93 శాతమే. సీఎస్‌ఈలో 35.83 శాతం, ఈఈఈలో 34.56 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 25.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
 
 పరిష్కారాలివీ...
 ఇంజనీరింగ్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు కోర్సు పట్ల, ఆపై ఉద్యోగావకాశాల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా ఓరియెంటేషన్(అవగాహన) కార్యక్రమాలను కళాశాలల్లో ఏర్పాటు చేయాలి.
 
 బాహ్య ప్రపంచంలో రకరకాల ఆకర్షణలకు గురికాకుండా, విద్యార్థులు తమంతట తాము నియంత్రించుకునేలా మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
 
 తల్లిదండ్రులు సెమిస్టర్ల వారీగా విద్యార్థి ప్రగతిని సమీక్షించాలి. ఇలా చేస్తే కొద్దిపాటి భయంతోనైనా విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ చూపుతాడు.
 
 ఏళ్ల తరబడి ఒకే మాదిరి సిలబస్ కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా కోర్సుల సిలబస్ మార్పుపై యూనివర్సిటీలు దృష్టి పెట్టాలి. ఔట్ డేటెడ్ సిలబస్‌తో బోర్ ఫీలయ్యే విద్యార్థులు.. కొత ్త సిలబస్ అంటే ఎక్కువ శ్రద్ధ చూపుతారు.
 
 విద్యార్థులు ఎంజాయ్‌మెంట్‌తో పాటు ప్రతి సెమిస్టర్‌లోనూ సబ్జెక్టులు మిగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. బహుళజాతి కంపెనీల్లో బ్యాక్‌లాగ్స్ ఉన్నా, కనీసం 60-65 శాతం మార్కులు లేకున్నా ఉద్యోగాలకు దూరం పెడుతున్నారు.
 
 కళాశాలలో జరిగే తరగతులకు రెగ్యులర్‌గా వెళుతూ ఇంటివద్ద కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట చదువుకుంటే చాలు అత్యుత్తమ ఫలితాలు ఇట్టే సొంతమవుతాయి.
 

Advertisement
Advertisement