సామి రంగా.. | Sakshi
Sakshi News home page

సామి రంగా..

Published Thu, Apr 23 2015 1:02 AM

సామి రంగా..

►  ఇంటర్  ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాకు అగ్రస్థానం
►  71 శాతం ఉత్తీర్ణత
►  59 శాతంతో హైదరాబాద్ రెండో స్థానం
►  రెండు జిల్లాల్లోనూ బాలికలదే హవా
►  ఒకేషనల్ కోర్సుల్లోనూ వారిదే ఆధిపత్యం

 
సాక్షి, సిటీబ్యూరో : ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో జంట జిల్లాల విద్యార్థులు దుమ్మురేపారు. ఉత్తమ ప్రతిభ కనబరచి అందరి దృష్టినీ ఆకర్షించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన  ఈ పరీక్ష ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. వృత్తి విద్యా కోర్సుల్లోనూ అదే స్థానాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా 59 శాతం ఉత్తీర్ణత సాధించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడేళ్లలో హైదరాబాద్ జిల్లా మొదటిసారిగా అధిక ఉత్తీర్ణత సాధించింది. ఎప్పటిలాగే తాజా ఫలితాల్లోనూ బాలికల హవా కొనసాగింది. జంట జిల్లాల్లోనూ బాలురపై బాలికలు ఆధిపత్యం ప్రదర్శించారు.
 
రికార్డు స్థాయిలో...
రంగారెడ్డి జిల్లా గతంలో మాదిరిగానే ఫలితాల్లో తనదైన ముద్ర వేసింది. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు, మూడు స్థానాలకు పరిమితం కాగా.. తాజా ఫలితాల్లో ఏకంగా 70 శాతానికి పైగా ఉత్తీర్ణతతో మొదటి స్థానం పొందింది. జిల్లాలో మొత్తం 1,04,207 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 73,563 మంది పాసయ్యారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 67,413 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 39,513 మంది ఉత్తీర్ణత సాధించారు.

సత్తాచాటిన బాలికలు
ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలు ప్రతిభ చాటారు. రంగారెడ్డి జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 47,973 మం ది బాలికలు పరీక్షలకు హాజరు కాగా.. 35,968 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు, బాలికల మధ్య ఉత్తీర్ణత తేడా 8 శాతంగా నమోదైంది. బాలురు 37,595 (67 శాతం) మందే పరీక్షల్లో గట్టెక్కారు.

హైదరాబాద్ జిల్లాలో...
పరీక్షలకు హాజరైన బాలికల్లో... 69 శాతం ఉత్తీర్ణులవడం విశేషం. బాలుర ఉత్తీర్ణతా శాతం 49. బాలురు, బాలికలకు ఉత్తీర్ణతలో 20 శాతం తేడా. 32,709 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 22,504 మంది ఉత్తీర్ణులయ్యారు. 34,704 మంది బాలురకుగాను.. 17,009 మంది పాసయ్యారు.

మహేశ్వరంలో 98.31 శాతం
హైదరాబాద్‌తో పోల్చితే రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మెరుగ్గా రాణించారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో పోటీ పడ్డారు. ప్రభుత్వ కళాశాలల విభాగంలో రంగారెడ్డి జిల్లా 46 శాతం ఉత్తీర్ణత సాధించి ఆరో స్థాంలో నిలిచింది. 37 శాతంతో హైదరాబాద్‌ది ఆఖరి స్థానం. రంగారెడ్డి జిల్లాలో 25 సర్కారు కళాశాలలు ఉండగా... 7 కాలేజీలలో 50 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా మహేశ్వరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.31 శాతం సాధిం చింది. 90.59 శాతంతో ఆ తర్వాతి స్థానాన్ని నవాబ్‌పేట్ కాలేజీసొంతం చేసుకుంది.

హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు పూర్తిగా చతికిలపడ్డారు. ఉన్న 19 కాలేజీలలో.. కేవలం రెండు కళాశాలల్లో 50 శాతం విద్యార్థులే పాసై నిరాశపరిచారు. మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో 61.23 శాతమే అత్యుత్తమం. ఉత్తీర్ణత పరంగా చూసుకుంటే గతేడాది కంటే 2.68 శాతంతో మెరుగ్గా ఉన్నా.. ఆశించిన స్థాయిలో విద్యార్థులు పాస్ కాలేకపోయారు.

వృత్తి విద్యలోనూ...
వృత్తి విద్యా కోర్సుల్లో 2010 నుంచి రంగారెడ్డి జిల్లా కంటే హైదరాబాద్ జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తూ వచ్చింది. ఈసారి సీన్ మారింది. తాజా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు దూసుకెళ్లారు. 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరేళ్లలో ఇదే అత్యుత్తమం. 2,558 మంది పరీక్షలు రాయగా.. 1,442 మంది విద్యార్థులు నెగ్గారు. ఇందులో 662 మంది బాలికలు పైచేయి సాధించారు. బాలురు 780 మంది పాసయ్యారు. 

హైదరాబాద్ జిల్లా తీవ్ర నిరాశపరిచింది. గతం కంటే రెండు శాతం ఉత్తీర్ణత తగ్గి... నాలుగో స్థానానికి పరిమితమైంది. 2013లో 50 శాతంగా ఉన్న ఉత్తీర్ణత.. తాజాగా 47 శాతానికి దిగజారింది. 3,422 మంది పరీక్షలు రాయగా.. 1,594 మంది పాసయ్యారు. ఇక్కడా బాలికలదే ఆధిపత్యం. 924 మంది (63 శాతం) బాలికలు ఉత్తీర్ణులు కావడం విశేషం. బాలురు 670 మంది (34 శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

Advertisement
Advertisement