ఓటు వేయడం ప్రాథమిక విధి | Sakshi
Sakshi News home page

ఓటు వేయడం ప్రాథమిక విధి

Published Tue, Jan 26 2016 4:02 AM

ఓటు వేయడం ప్రాథమిక విధి - Sakshi

లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడం ప్రాథమిక విధి అని లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ సోమవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 51-ఎ లో ప్రాథమిక విధులు ఉన్నాయని, ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ ఆ విధుల్లో చేర్చాలని, దీని కోసం చట్టసభల ప్రతినిధులు కృషి చేయాలన్నారు. నూరు శాతం ఓటింగ్ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం నిండుగా ఉంటుందని, ఈ దిశగా యువతను చైతన్యం చేయాలన్నారు. స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా, ప్రలోభాలకు గురికాకుండా సేవ చేసే అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు.

ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యం చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంచివారిని ఎన్నుకోవాలని, ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని విజ్ఞప్తి చేశారు. చదువుకున్నవారు నివసించే ప్రాంతాల్లోనే ఓటింగ్ తక్కువగా జరుగుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  పోలింగ్ కేంద్రం సమాచారంతో ఓటర్ స్లిప్పులను ఇంటింటికి అందజేస్తున్నామని, ఇప్పటికే 20 లక్షలకుపైగా స్లిప్పులను అందజేశామన్నారు.

ఓటర్ స్లిప్పులను ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మతం, జాతి, కులం, వర్గం, భాష సహా ఇతర ప్రభావాలకు లోనుకాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామంటూ రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఓటుహక్కు నమోదులో ముందు వరుసలో నిలిచిన కర్నూలు కలెక్టర్ విజయ్‌మోహన్, అప్పట్లో నిజామాబాద్ కలెక్టర్‌గా ఉన్న ప్రస్తుత మెదక్ కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌తోపాటు ఇతర అధికారులను జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సన్మానించారు. 1954 నుంచి క్రమం తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొంటున్న సీనియర్ సిటిజన్లు శ్రీరాములు(88), సుదర్శన్‌రాజు తదితరులను సన్మానించారు. ఇటీవల ఓటు హక్కు పొందిన యువతకు ఓటరు కార్డులను అందించారు.

Advertisement
Advertisement