అసహనం పెరిగిపోతోంది | Sakshi
Sakshi News home page

అసహనం పెరిగిపోతోంది

Published Sat, Jan 28 2017 2:06 AM

అసహనం పెరిగిపోతోంది

- దేశంలో అన్ని రూపాల్లో హింస పెచ్చరిల్లుతోంది
- ప్రముఖ హిందీ రచయిత అశోక్‌ వాజ్‌పేయి విమర్శ
- దురదృష్టవశాత్తు ప్రపంచం ఇండియాలా మారుతోందని వ్యాఖ్య
- కన్నుల పండువగా ప్రారంభమైన 7వ హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌
- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అసహనం తీవ్ర స్థాయికి చేరుకుందని.. మతం, కులం, విద్య, వ్యక్తిగతం వంటి అన్నిరూపాల్లోనూ హింస పెచ్చరిల్లుతోందని ప్రముఖ హిందీ రచయిత అశోక్‌ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంపై ఇదే రకమైన దాడి జరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం 7వ హైదరాబాద్‌ సాహిత్య సాంస్కృతిక ఉత్సవం(లిటరరీ ఫెస్టివల్‌) ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, పలు దేశాలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అధ్యక్షతన ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి ప్రముఖ హిందీ రచయిత అశోక్‌ వాజ్‌పేయి ముఖ్య అతిథిగా హాజరై.. "మన కాలంలో సాహిత్యం" అన్న అంశంపై ఉపన్యసించారు. దురదృష్టవశాత్తూ ప్రపంచం ఇండియాలా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అసహనం తీవ్ర స్థాయికి చేరుకుందని.. మతం, కులం, విద్య, వ్యక్తిగతం వంటి అన్నిరూపాల్లోనూ హింస పెచ్చరిల్లుతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంపై ఇదే రకమైన దాడి జరుగుతోందన్నారు.

కలిసే జీవించాం..
భారతదేశం ఎప్పుడూ ఏకోన్ముఖ సమాజం కాదని.. ఇక్కడ అన్ని మతాలు, సమాజాలు కలిసి జీవించాయని అశోక్‌ వాజ్‌పేయి గుర్తు చేశారు. "మన భారతీయ సంప్రదాయ వివేకంలో "ఇతర" అనేది లేదు. ప్రతిదీ మనదే. ఇక్కడ ఇతరులు లేకుండా దేవుడు కూడా మనలేడు. అందుకే రకరకాల అవతారాల్లో వచ్చి ఇతరులను కలిశాడు.." అని ప్రాచీన భారతీయ బహుముఖీనతను ప్రస్తుతించారు. ప్రస్తుతం ఆ వివేకం కొరవడుతోందని.. దాన్ని ప్రశ్నించిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని మండిపడ్డారు.

ఆ ధోరణిని నిరసిస్తూ తన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును, హెచ్‌సీయూ ఇచ్చిన డీ.లిట్‌ను రోహిత్‌ వేములకు జరిగిన అన్యాయానికి నిరసనగా వెనక్కి ఇచ్చానని గుర్తుచేశారు. "ఒక కొలంబియా రచయిత చెప్పినట్లు.. ఈ ప్రపంచం సరిగ్గా నిర్మితం కాలేదనడం అబద్ధం. ఇంకో మెరుగైన ప్రపంచానికి అవకాశం ఉంది. దానికోసం మనం కల కనొచ్చు.." అని ఆశాభావం వ్యక్తం చేశారు. సాహిత్యం మాత్రమే ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణాన్నీ, నైతికతనూ, మత విశ్వాసాన్నీ, భావజాలాన్నీ ఇవ్వగలదని పేర్కొన్నారు. మతం, రాజకీయం రెండూ కూడా సత్యాన్ని ఇవ్వలేవని, సాహిత్యం మాత్రమే సత్యాన్ని అందించగలుగుతుందని వ్యాఖ్యానించారు.

సాహిత్యం అంటేనే సంబరం
"ఒక నిజమైన రచయిత నీకో సత్యాన్ని ఇస్తాడు, అదే సమయంలో ఆ సత్యాన్ని అతడే శంకిస్తాడు. అత్యున్నత సత్యం అంటూ ఏదీ ఉండదు. సాహిత్యం అంటేనే ప్రతిసారీ జీవితాన్ని సెలబ్రేట్‌ చేయడం. కానీ ఒక్కోసారి జీవితం కూడా సాహిత్యాన్ని సెలబ్రేట్‌ చేస్తే బాగుంటుంది. ఇలాంటి సాహిత్య సమావేశాలు అందుకు వీలు కల్పిస్తాయి.."అని ఫెస్టివల్‌ నిర్వాహకులను అశోక్‌ వాజ్‌పేయి అభినందించారు. 60 ఏళ్ల క్రితం తన 17వ ఏట హైదరాబాద్‌లోని "కల్పన" పత్రిక తన హిందీ కవితలను అచ్చు వేసి కవిగా తనకు తొలి గుర్తింపు ఇచ్చిందంటూ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయన తన కవితలను ఆంగ్లంలోనూ, హిందీలోనూ చదివి వినిపించినప్పుడు సభికుల్లో మంచి స్పందన వచ్చింది. అనంతరం మరో అతిథి ఫిలిప్పీన్స్‌ రాయబారి టెరిస్టా సి డాజా మాట్లాడారు. భారతీయ సంస్కృతి, కళలు, భాషలకు.. ఫిలిప్పీన్స్‌ కళలు, భాషలకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్నారు. ఆ దేశంలోని సుమారు 400 స్థానిక భాషలలో సంస్కృత భాష మూలాలు కనిపిస్తాయని... భారతీయ నృత్య రూపాలను పోలిన నృత్యాలు ఫిలిప్పీన్స్‌లో ప్రాచుర్యంలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ డైరెక్టర్లు అజయ్‌గాంధీ, కిన్నెర మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జయలలితపై ఆసక్తికర చర్చ
లిటరరీ ఫెస్టివల్‌లో ప్రముఖ తమిళ రచయిత్రి, సీనియర్‌ జర్నలిస్టు వాసంతి రాసిన ‘అమ్మ జయలలిత.. జర్నీ సినీస్టార్‌ టు పొలిటికల్‌ క్వీన్‌’పుస్తకంపై ఆసక్తికర చర్చ జరిగింది. మొత్తం తమిళ సమాజాన్నే ప్రభావితం చేసిన జయలలితపై ఈ పుస్తకం అనేక కోణాలను ఆవిష్కరించింది. జయలలిత వ్యక్తిగత జీవితం నుంచి సినీ, రాజకీయ జీవితం వరకు అనేక అంశాలను ప్రస్తావించిన ఈ పుస్తకం వెలువడిన అనంతరం రచయిత్రి వాసంతి తమిళనాడులో ఉండలేని పరిస్థితి నెలకొంది. తాజాగా చర్చా కార్యక్రమంలో ఆ పుస్తకంలోని పలు అంశాలను సమన్వయకర్తగా వ్యవహరించిన సునీతారెడ్డి ప్రస్తావించారు. సినిమాల్లో, రాజకీయాల్లో బలంగా ఉన్న పురుషాధిపత్యాన్ని ఎదుర్కోవడం, ప్రత్యర్థి కరుణానిధిపై రాజకీయంగా పైచేయి సాధించడం, సంక్షేమం కోసం జయలలిత ప్రవేశపెట్టిన పథకాలు, శోభన్‌బాబుతో జయలలిత బంధం తదితర అంశాలను ప్రస్తావించారు.

ఈ సమయంలో రచయిత్రి వాసంతి మాట్లాడుతూ.. జయలలిత గొప్ప నాయకురాలు కాకపోయినా, అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకుని, వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎదిగారని చెప్పారు. కేవలం పదో తరగతి చదివినా విస్తృతమైన అధ్యయనంతో ఆంగ్లంపై పట్టు సాధించారని, జయలలిత జీవితంలో నిరంతర సంఘర్షణ, ఒత్తిడి, బాధలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు అందానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన జయలలిత రాజకీయాల్లోకి వచ్చాక తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయలేదన్నారు. శుక్రవారం నాటి కార్యక్రమాల్లో దివ్యదిశ సంస్థ "చైల్డ్‌హుడ్‌ ఇన్‌ మై సిటీ" కార్యక్రమం ఆకట్టుకుంది. మహాశ్వేతాదేవి కథ ఆధారంగా ప్రదర్శించిన "చోళీ కే పీచే క్యా హై" నాటక ప్రదర్శన, ఫిలిప్పీన్స్‌ కళాకారుల "కార్మిక్‌ హార్వెస్ట్‌", ఆదిలాబాద్‌ గిరిజనుల గుస్సాడి నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement