అంతా అసూయపడేలా ఐటీ పాలసీ | Sakshi
Sakshi News home page

అంతా అసూయపడేలా ఐటీ పాలసీ

Published Thu, Mar 31 2016 2:17 AM

అంతా అసూయపడేలా ఐటీ పాలసీ - Sakshi

- ఏప్రిల్ 4న ఐటీ ప్రముఖుల సమక్షంలో కేసీఆర్ ఆవిష్కరణ
- అనుబంధంగా మరో 4 విధానాలు కూడా.. దిగ్గజ సంస్థలతో సర్కారు ఎంవోయూలు
- విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ వెల్లడి
- అమెజాన్ ఇండియా క్యాంపస్‌కు శంకుస్థాపన

 
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలూ అసూయపడేలా తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పాలసీ ఉండనుందని ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా క్యాంపస్‌కు శంఖుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ ఐటీ  పాలసీ గురించి విలేకరులకు వివరించారు. అన్ని హంగులతో, అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకునేలా రూపుదిద్దుకున్న ఐటీ పాలసీ రాష్ట్ర ఉజ్వల భవితకు సంకేతం కానుందన్నారు. ఈ నెల 4న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఐటీ ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలసీని ఆవిష్కరిస్తారని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సార స్వత్, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి, సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్, ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ ఘోష్, సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ రాంరెడ్డి, మైక్రోసాఫ్ట్ ఎండీ భాస్కర్ ప్రామాణిక్, ఎల క్ట్రానిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో మహాపాత్ర, శామ్‌సంగ్ వైస్ చైర్మన్ దీపక్ భరద్వాజ, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తదితరులు హజరుకానున్నారని మంత్రి పేర్కొన్నారు.
 
 అనుబంధంగా మరో నాలుగు పాలసీలు
 ఐటీ పాలసీతోపాటు అదే వేదికపై ఐటీకి అనుబంధంగా మరో నాలుగు పాలసీలను ఆవిష్కరించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. స్టార్టప్స్‌కు చేయూత ఇచ్చేలా ఇన్నోవేషన్ పాలసీ ఉంటుందన్నారు. ఐటీ సెక్టార్‌ను హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా కిందిస్థాయికి తీసుకెళ్లేందుకు ద్వితీ యశ్రేణి నగరాలకు విస్తరించేలా రూరల్ టెక్నాలజీ పాలసీని రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేకి న్ ఇండియా మాదిరిగా మేకిన్ తెలంగాణ కోసం రాష్ట్రంలో హార్డ్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎల క్ట్రానిక్స్ పాలసీని తెస్తున్నామన్నారు. వీటితోపాటు విస్తృత ఉపాధి అవకాశాలుండే గేమింగ్ అండ్ యానిమేషన్ రంగాల అభివృద్ధి కోసం గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. గేమింగ్ అండ్ యానిమేషన్ రంగంలో ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించబోతున్నామన్నారు. ఈ మేరకు ఆయా రంగాల్లో దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం, టి-హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఎంఓయూలు చేసుకుంటాయని కేటీఆర్ వివరించారు.
 
 హైదరాబాద్‌కు ఐటీఐఆర్ డౌటే..!
 యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను ప్రకటించినప్పటికీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ చెప్పారు. ఐటీఐఆర్ విషయమై పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించి కనీసం రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని కోరగా కేవలం రూ. 165 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్రం సహకరించినా లేకున్నా ఐటీ రంగం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
 
 రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగానే జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఐటీ వృద్ధిరేటు 16 శాతం అధికంగా ఉందని, ఐటీ ఎగుమతులు కూడా రూ. 68 వేల కోట్లకు పెరిగాయన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భద్రతలో కీలకమైన సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పాలసీని కూడా త్వరలోనే తెస్తామని మంత్రి చెప్పారు. ఇటీవల కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసినప్పుడు ఐటీఐఆర్ విషయమై పునరాలోచిస్తున్నట్లు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఆశించిన మేరకు నిధులు రాకపోవడం వల్లే ఐటీఐఆర్ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement