ఒక సంస్కరణగానే చూడాలి | Sakshi
Sakshi News home page

ఒక సంస్కరణగానే చూడాలి

Published Fri, Jun 2 2017 1:49 AM

ఒక సంస్కరణగానే చూడాలి - Sakshi

గోవధ నిషేధ చట్టంపై  కేంద్ర మంత్రి అబ్బాస్‌ నక్వీ 
- తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమని ధీమా 
 
సాక్షి, హైదరాబాద్‌: గోవధ నిషేధ చట్టాన్ని మతపరంగా కాకుండా ఓ సంస్కరణగా మాత్రమే చూడాలని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ చెప్పారు. పశువులను ఎలాంటి నియంత్రణ లేకుండా ఎక్కడికక్కడ వధిస్తుండడంతో ఆరోగ్యపరమైన, పర్యావరణ సంబం ధిత సమస్యలు వస్తున్నాయన్నారు. గోవధను కొందరి మనోభావాలతో ముడిపడిన అంశంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే పశువుల మార్కెట్‌ను వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యలను చేపట్టిందన్నారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉందని, చాలా రాష్ట్రాల్లో ఈ నిషేధ చట్టం అమల్లో ఉన్నా కొన్ని రాష్ట్రాలు అమలు చేయడంలేదన్నారు.

గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, చింత సాంబమూర్తి, యెండల లక్ష్మీనారాయణ, కృష్ణసాగర్‌రావు తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే బీఫ్‌ పార్టీలంటూ ఆవులను వధించి బహిరంగంగా ప్రదర్శించడం దేశ సామరస్యతను దెబ్బతీస్తుందని, ఇటువంటి నేరపూరిత చర్యలను ప్రభుత్వం ఉపేక్షించేది లేదని నక్వీ స్పష్టం చేశారు. 
 
మోదీ పాలనకు డిస్టింక్షన్‌...: మూడేళ్ల మోదీ పాలన అర్ధసంవత్సర పరీక్షలనుకుంటే.. వందకు వంద శాతం మార్కులతో డిస్టింక్షన్‌లో పాసైందన్నారు. తమ మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్‌ 15 (భారతరత్న అబ్దు ల్‌ కలాం జయంతి) నుంచి దేశంలోని వంద జిల్లాల్లో ‘తెహరీక్‌ ఏ తాలీమ్‌’కింద ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రభుత్వ హాస్టళ్లు, పీహేచ్‌సీలలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశంలోని 1.82 కోట్ల మంది విద్యార్థులకు రూ.4,740 కోట్ల మేర స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశామన్నారు. 
 
ఇక్కడా బీజేపీ అధికారంలోకి వస్తుంది
తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందనే ధీమాను ముక్తార్‌ అబ్బాస్‌ వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీతో, బీజేపీకి తెలంగాణతో అవసరం ఉందన్నారు.  తమ పాలనలో చెప్పుకోవడానికి ఏమి లేకనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ముందుకు తెచ్చిం దన్నారు. రాజ్యాంగబద్ధత లేనందున ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి అమిత్‌షా చెబుతుంటే ఇక్కడి ప్రభుత్వానికి కోపం వస్తోందన్నారు. ఈ లెక్కలను తాము అడగడం లేదని, ప్రజలే ప్రశ్నిస్తున్నారని అన్నారు. 

Advertisement
Advertisement