వెయ్యి కోట్లతో ఐయూఐహెచ్ ఆస్పత్రి | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్లతో ఐయూఐహెచ్ ఆస్పత్రి

Published Sat, Feb 6 2016 3:36 AM

వెయ్యి కోట్లతో ఐయూఐహెచ్ ఆస్పత్రి - Sakshi

♦  హైదరాబాద్‌లో వెయ్యి పడకలతో స్థాపనకు ముందుకు..
♦ ఇండో-యూకే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
♦ మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి సమక్షంలో ఎంవోయూ
♦ హైదరాబాద్‌లో మరో రెండు మెగా ప్రభుత్వ ఆసుపత్రులు
 
 సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తరహాలో హైదరాబాద్‌లో మరో రెండు మెగా ఆసుపత్రులను ప్రభుత్వపరంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పెరిగిన హైదరాబాద్ నగర జనాభాకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య రంగంలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్)తో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఐయూఐహెచ్ ప్రతినిధులతో కలసి లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వెయ్యి పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, పరిశోధన సంస్థ తదితరాల స్థాపనకు ముందుకు వచ్చిన ఐయూఐహెచ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఐయూఐహెచ్ పెట్టుబడులకు ముందుకు రావడం హర్షణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆసుపత్రి స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ నిర్ణీత గడువులోగా ఇస్తామని... హైదరాబాద్‌ను మెడికల్ హబ్‌గా మార్చేందుకు ప్రస్తుత పెట్టుబడులు దోహదం చేస్తాయని చెప్పారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణలో ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపడాన్ని ఐయూఐహెచ్ చైర్మన్ మైక్ పార్కర్ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ రమణి, ఐయూఐహెచ్ తరఫున సంస్థ ఎండీ, సీఈవో డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా ఎంవోయూపై సంతకాలు చేశారు. సమావేశంలో ఐయూఐహెచ్ ప్రతినిధులు జేన్ గ్రేడీ, మైక్, అమన్, వినయ్ సింఘాల్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఉప కార్యదర్శి వి.సైదా, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 ఒప్పందంలోని ప్రత్యేకతలు..
 గత ఏడాది నవంబర్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సమక్షంలో భారత్‌లో పెట్టుబడులకు ఐయూఐహెచ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో సుమారు బిలియన్ డాలర్ల పెట్టుబడులతో... 11 వేల పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రులతోపాటు 25 వేల మంది నర్సులు, ఐదు వేల మంది వైద్యులకు ఉపాధి, 20 నుంచి 30 కోట్ల మందికి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. అందులో భాగంగా చండీగఢ్‌లో కింగ్స్ కాలేజీ ఆసుపత్రి స్థాపనకు ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్టు, ఇండో-యూకే హెల్త్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఆస్పత్రి ఏర్పాటుకు ఐయూఐహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం... రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన వెయ్యి పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, పరిశోధన కేంద్రం తదితరాలు ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో మరిన్ని యూకే సంస్థలు భారత్‌లో వైద్య, ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఐయూఐహెచ్ ప్రతినిధులు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement