విభజన ప్రక్రియలన్నీ ముగియాలి | Sakshi
Sakshi News home page

విభజన ప్రక్రియలన్నీ ముగియాలి

Published Fri, Feb 28 2014 12:29 AM

విభజన ప్రక్రియలన్నీ ముగియాలి

అపాయింటెడ్ డే ఖరారుపై జైరాం రమేశ్
  వచ్చేవారంలో రాష్ర్టపతికి తెలంగాణ బిల్లు
 టీఆర్‌ఎస్ పోరాడినా అంతిమంగా
 తెలంగాణ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్‌దే
 బీజేపీ సీమాంధ్రకు ప్రత్యేక హోదా అడగలేదు
 ప్రస్తుత డిజైన్‌లోనే పోలవరం నిర్మాణం
 కిరణ్ కొత్తపార్టీతో నష్టం లేదు
 
 సాక్షి, హైదరాబాద్: ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు తదితరాలకు సంబంధించిన విభజన ప్రక్రియలన్నీ ముగిసిన తర్వాతే రెండు రాష్ట్రాల అధికారిక విభజనకు వీలుగా అపాయింటెడ్ డే నిర్ణయమవుతుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును న్యాయశాఖ పరిశీలించి వచ్చే వారం రాష్ట్రపతికి పంపుతుందని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత అపాయింటెడ్ డే ఖరారవుతుందన్నారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రోజును ‘నోటిఫైడ్ డేట్’గా, ఇద్దరు ముఖ్యమంత్రులు నియమితులైన రోజును ‘అపాయింటెడ్ డే’గా పిలుస్తారని ఆయన వివరించారు. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లు ఏర్పడినప్పుడు నోటిఫైడ్ డేట్ తర్వాత మూడు నెలలకు అపారుుంటెడ్ డే రావడాన్ని ఆయన గుర్తు చేశారు.
 
 తెలంగాణ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్‌దే తప్ప బీజేపీదేమీ లేదని, ఆ పార్టీ కనీసం సీమాంధ్రకు ప్రత్యేక హోదాను కూడా అడగలేదని తెలిపారు. టీఆర్‌ఎస్ పోరాటం చేసినా అంతిమంగా తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం, పొత్తులపై పార్టీలో చర్చలు సాగుతున్నాయని జైరాం చెప్పారు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పార్టీ ఎస్సీ సెల్ జాతీయ చైర్మన్ కొప్పుల రాజులతో కలసి మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరస్పర సహకారం లేకపోతే బిల్లులో పొందుపరిచిన అంశాల అమలు కష్టమేనని అభిప్రాయపడ్డారు.
 
 ఎన్నికల కోసమే రాష్ట్ర విభజన చేశామనడం సరికాదని, తెలంగాణ ఇచ్చినా సీమాంధ్ర హక్కుల పరిరక్షణకు కూడా కేంద్రం, కాంగ్రెస్ కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టికల్ 371 డీ కొనసాగుతుందని తెలిపారు. సీమాంధ్రకు కొత్త రాజధానిగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, ఒంగోలు ప్రాంతాలను ఏర్పాటు చేయూలంటూ వేర్వేరుగా వినతులు అందాయన్నారు. దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటయ్యాక ఆరునెలల్లో నివేదిక అందుతుందని, ఆ తర్వాత కొత్త రాజధానిపై నిర్ణయం జరుగుతుందని చెప్పారు. సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం, గిరిజన యూనివర్సిటీలు, సూపర్‌స్పెషాల్టీ మెడికల్ సెన్సైస్, దుగ్గరాజపట్నం పోర్టు, కడపలో స్టీలు ప్లాంటు, కాకినాడ-రాజమండ్రిల మధ్య పెట్రో కెమికల్స్ కాంప్లెక్సు, విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
 
  పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్లోనే నిర్మాణమవుతుందని, దీని బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని పేర్కొన్నారు. చేవెళ్ల ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టులకు జాతీయహోదా అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తోందన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదాను కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కోరారన్నారు. బీజేపీ నేతలు జైట్లీ, వెంకయ్యనాయుడులు ప్రధానిని కలసినా ప్రత్యేక హోదాను కోరలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో తమ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లడం పెద్ద సవాలేనన్నారు. సోనియూ సహా అందరినీ కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నా హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకోకుండా సీఎంగా ఎందుకు కొనసాగిస్తోందో తనకు తెలియదన్నారు. కిరణ్ సుప్రీంకోర్టుకు వెళ్లినా బిల్లుకు ఎలాంటి ఆటంకాలూ ఉండవని జైరాం అభిప్రాయపడ్డారు. కిరణ్ కొత్తపార్టీ వల్ల కాంగ్రెస్‌కు నష్టముంటుందని భావించడం లేదన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సోనియాను విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.
 
 2న గుంటూరుకు జైరాం: విభజన అంశాలను సీమాంధ్ర ప్రజలకు వివరించాలని జైరాం రమేశ్ నిర్ణయించారు. తన పర్యటనపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో చర్చించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన తర్వాత గాంధీభవన్‌లోనే కొద్దిసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వచ్చేనెల 2న గుంటూరు పర్యటన ఖరారు చేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వాస్తవానికి శుక్రవారం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే అదేరోజు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటంతో వాయిదా పడింది.
 
 గవర్నర్‌తో భేటీ:  జైరాం రమేశ్ గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఆయన వెంట ఉన్నారు. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలపై వారు చర్చించారని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలనదిశగా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో ఈ అంశంపైనా చర్చ జరిగి ఉండవచ్చని చెబుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement