ఏటా జలమండలికి రూ.5.72 కోట్ల నష్టం | Sakshi
Sakshi News home page

ఏటా జలమండలికి రూ.5.72 కోట్ల నష్టం

Published Fri, Oct 4 2013 4:04 AM

ఏటా జలమండలికి రూ.5.72 కోట్ల  నష్టం - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కాంతులు వెదజల్లాల్సిన మురుగుశుద్ధి కేంద్రాల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. నగరంలోని అంబర్‌పేట్, నాగోల్, నల్లచెరువు(ఉప్పల్) మురుగు శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) స్థాపిత సామర్థ్యం మేరకు పనిచేయాల్సిన విద్యుత్ కేంద్రాలు సవాలక్ష సాంకేతిక సమస్యలతో కునారిల్లుతున్నాయి. నిత్యం మూడు ఎస్టీపీల్లో 850 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన యంత్రాలు కనాకష్టంగా 400 కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేసి చతికిలపడుతున్నాయి. జలమండలి పర్యవేక్షణ లోపం.. అధికారుల నిర్లక్ష్యం.. అధ్వాన నిర్వహణ.. అంతులేని అవినీతి.. తదితర కారణాల వల్ల కోట్లాది రూపాయలు మురుగుపాలవుతున్నాయి. మరోవైపు చారిత్రక మూసీనదిని మురుగు కంపు నుంచి కాపాడేందుకు నూతనంగా మరో పది ఎస్టీపీలను నిర్మించే అంశంపై ఇటు జలమండలి, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మూడేళ్లుగా ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి.
 
అరకొర విద్యుదుత్పత్తి


 ఐదేళ్ల క్రితం సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో మూడు ఎస్టీపీల్లో ఏర్పాటు చేసిన ఆస్ట్రియా, జర్మనీ దేశాలకు చెందిన గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి యంత్రాల నిర్వహణ లోపంతో తరచూ మొరాయిస్తున్నాయి. ఏటా రూ.2 కోట్ల మేర నిర్వహణ, మరమ్మతులకు కేటాయిస్తున్నా సిబ్బంది చేతివాటంతో ఫలితం లేకుండా పోతోంది. అంబర్‌పేట్ మురుగు శుద్ధి కేంద్రం వద్ద రోజువారీగా మూసీలో కలుస్తున్న 340 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ మురుగు నీటిలోని ఆర్గానిక్ పదార్థాల నుంచి విడుదలయ్యే మీథేన్ గ్యాస్‌తో 600 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జలమండలి లక్ష్యం నిర్దేశించింది. కానీ ప్రస్తుతానికి 350 కిలోవాట్లే ఉత్పత్తి అవుతోంది. దీంతో నెలవారీగా ఎస్టీపీ నిర్వహణకయ్యే విద్యుత్ కోసం రూ.20 లక్షల బిల్లును జలమండలి చెల్లించాల్సి వస్తోంది. ఇక నాగోల్ మురుగు శుద్ధి కేంద్రం వద్ద నిత్యం 170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు.

ఇక్కడ ఉత్పన్నమయ్యే మీథేన్ గ్యాస్ ద్వారా రోజువారీగా 200 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాలను ఏర్పాటు చేశారు. కానీ కేవలం 50 కిలోవాట్లు ఉత్పత్తి చేసి ఇక్కడి కేంద్రం చతికిలపడుతోంది. ఇక్కడా షరామామూలుగానే విద్యుత్ అవసరాలకు నెలకు రూ.10 లక్షలు చెల్లించిన దుస్థితి తలెత్తింది. ఇక ఉప్పల్ నల్లచెరువు ఎస్టీపీ వద్ద 30 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 50 కిలోవాట్లు. కానీ ఉపకరణాలు పనిచేయకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం గమనార్హం. ఇక్కడా విద్యుత్ బిల్లు నెలకు రూ.లక్ష చెల్లించాల్సిన పరిస్థితి.

 నిర్వహణ మెరుగుపడితేనే...

 మొత్తంగా ఎస్టీపీల వద్ద విద్యుత్ అవసరాలకు నెలకు రూ.31 లక్షల బిల్లు జలమండలి చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏటా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.3.72 కోట్ల నష్టాన్ని బోర్డు భరించాల్సి వస్తోంది. ఇక నిర్వహణ మరమ్మతుల పేరిట ఏటా రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది. మొత్తంగా ఏడాదికి రూ.5.72 కోట్ల నష్టాన్ని భరించాల్సిన దుస్థితి తలెత్తింది. ఎస్టీపీల నిర్వహణ తీరు మెరుగుపడితే ఈ మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 కార్యాచరణకు నోచని ప్రతిపాదనలు

 చారిత్రక మూసీ నదిని మురుగుకూపం నుంచి రక్షించేందుకు గ్రేటర్ వ్యాప్తంగా నూతనంగా పది మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నెలకొల్పాలన్న జలమండలి ఆశయం నీరుగారుతోంది. కొత్త ఎస్టీపీల ప్రతిపాదనలు గత మూడేళ్లుగా కాగితాలకే పరిమితమౌతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పైసా నిధులు విదల్చడంలేదు. దీంతో జలమండలి నిధులు లేవని చేతులెత్తేసింది. జాతీయ నదీ పరిరక్షణ పథకం (ఎన్‌ఆర్‌సీడీ ) కింద నూతన ఎస్టీపీలను నిర్మించాలన్న ప్రతిపాదనలు కూడా కార్యాచరణకు నోచుకోలేదు. ఫలితంగా నిత్యం 900 మిలియన్ లీటర్ల శుద్ధి చేయని మురుగు నీరు చేరి మూసీ కాలుష్య కాసారమౌతోంది.

Advertisement
Advertisement