నేనెట్ల కోవర్టుని అయిత? - జానా | Sakshi
Sakshi News home page

నేనెట్ల కోవర్టుని అయిత? - జానా

Published Mon, Oct 10 2016 7:10 PM

Jana Reddy attends review meeting

హైదరాబాద్: తనను కోవర్టుగా పార్టీ నాయకులే కొందరు అభివర్ణిస్తున్నారని ప్రతిపక్షనేత కె.జానా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు కె.జానా రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండరెడ్డి తదితరులు సోమవారం సమావేశమయ్యారు.

రుణమాఫీకై రైతులతో దరఖాస్తులు చేయించడం, ఫీజుల రీయింబర్సుమెంటుపై విద్యార్థులతో దరఖాస్తు చేయించాలని టీపీసీసీ తీసుకున్న ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు పార్టీ ముఖ్యనేతలను బాధ్యులుగా నియమించాలని నిర్ణయించారు. నెలరోజుల పాటు గ్రామాల్లో రైతుల నుంచి, విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, దీనికి ప్రస్తుత జిల్లాల వారీగా బాధ్యులుగా ముఖ్యనేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టడంపై పార్టీ ముఖ్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తిని వెలిబుచ్చినట్టుగా తెలిసింది.

ఇదే సందర్భంలో జానా రెడ్డి మాట్లాడుతూ.. తనపై కొందరు పార్టీ నేతలే అనుచితంగా మాట్లాడుతున్నారని, కోవర్టు అంటూ తనను ఉద్దేశించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. కోవర్టు అంటూ తాను మాట్లాడలేదని వి.హనుమంతరావు సమాధానం ఇవ్వడంతో ఈ చర్చ సద్దుమణిగినట్టుగా తెలిసింది. రేవంత్ రెడ్డి విమర్శల గురించి కాంగ్రెస్‌పార్టీ ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టుగా సమాచారం.

Advertisement
Advertisement