Sakshi News home page

కేంద్రం మాట తప్పకూడదు.. బాబైనా అడగాలి

Published Fri, Nov 25 2016 7:05 PM

కేంద్రం మాట తప్పకూడదు.. బాబైనా అడగాలి - Sakshi

హోదా దగా.. కింకర్తవ్యం? పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జేపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న మాటకు కేంద్రం కట్టుబడి ఉండాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ అన్నారు. హోదా దగా.. కింకర్తవ్యం? పేరుతో లోక్‌సత్తా పార్టీ రూపొందించిన పుస్తకాన్ని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర‍్భంగా జేపీ మాట్లాడుతూ పారిశ్రామిక పన్ను రాయితీలు హోదాలో భాగమేనన్నారు. ఉద్యోగాలు, పన్ను రాయితీలు, అభివృద్ధి వస్తాయన్న ఆశతోనే 2014 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ- బీజేపీ కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ఏరుదాటక తెప్ప తగలేసినట్టు వ్యవహరిస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూడా హోదా విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ విజ్ఞతతో మిగిలిన రాజకీయ పక్షాలను కలుపుకొని పనిచేయాలన్నారు. చంద్రబాబే హోదాపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

విదేశాల్లో నల్లదనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేయడం మన చేతుల్లో లేదుగానీ, రాజకీయ సంకల్పం ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని జేపీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయనుకుంటే, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ సహా వెనుకబడిన జిల్లాలకు హోదా ఇవ్వమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరాలన్నారు. హోదా దగా.. కింకర్తవ్యం? బుక్‌లెట్‌లో ఈ అంశాలన్నింటినీ వివరంగా పేర్కొన్నందున ప్రజలలోకి విరివిరిగా తీసుకెళ్లాలని జేపీ పార్టీ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్టీ అధ్యక్షుడు బీశెటి బాబ్జీతో పాటు పలువురు లోక్సత్తా నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement