ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయింది | Sakshi
Sakshi News home page

ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయింది

Published Tue, Feb 9 2016 2:36 AM

ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయింది

ప్రజాస్వామ్యంపై జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్య

 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో నాయకత్వాన్ని చూడకుండా కేవలం తాత్కాలిక ధోరణులతో, భావోద్వేగాలతో ఓటు వేయడం.. తర్వాత  ప్రతిరోజూ దిగిపోండంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల భారతదేశ ప్రజాస్వామ్యమే వక్రమార్గం పడుతోందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని హర్వర్డ్ విశ్వవిద్యాలయంలో శని, ఆదివారాల్లో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్‌లో జేపీ పాల్గొని అక్కడి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

ఆయన ప్రసంగ వివరాలను పార్టీ సోమవారం మీడియాకు విడుదల చేసింది. స్థానిక స్వయం పాలన, సరైన విధివిధానాలు లేకపోవడం వల్లే భారత ప్రజాస్వామ్యం ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఖరారు కావడానికే విద్య, ఆరోగ్య విధివిధానాలపై హోరాహోరీగా రాజకీయ నాయకులు తలపడుతుంటే.. భారత్‌లో పార్టీలు, నేతల మధ్య విధానాలు, ఆలోచనల కనీస పోరాటమే లేదన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ పరిపాలన రంగంలో మూడు మార్పులు చోటుచేసుకోవాలని జేపీ సూచించారు. మొదటిది.. ఢిల్లీ అధికారాలను కేంద్ర, విదేశాంగ అంశాలకే పరిమితం చేయాలి. రెండోది సొంత పాలనను, అందుకు విధానాలను రూపొందించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకివ్వాలి. అవి స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. మూడోది ప్రభుత్వ అధికార యంత్రాంగంలో నైపుణ్యాలను పెంపొందించి పారదర్శక వ్యవస్థను ప్రవేశపెట్టాలని జేపీ వివరించారు.

Advertisement
Advertisement