రేపు జేఈఈ మెయిన్: ఏర్పాట్లు పూర్తి | Sakshi
Sakshi News home page

రేపు జేఈఈ మెయిన్: ఏర్పాట్లు పూర్తి

Published Sat, Apr 2 2016 3:14 AM

JEE mains exam, preparations completed

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ మెయిన్-2016 పరీక్షకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 59,731 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 42,971 మంది, వరంగల్‌లో 11,783 మంది, ఖమ్మంలో 4,977 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నట్లు జేఈఈ కో-ఆర్డినేటర్ మథ్యాస్‌రెడ్డి తెలిపారు.

బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

సెంటర్ ముందే చూసుకోండి..
పేపర్-1 పరీక్షకు హాజరయ్యేవారిని ఉదయం 7 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 9:20 గంటలకు పరీక్ష బుక్‌లెట్లను పంపిణీ చేస్తారు. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది.

పేపర్-2 పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 1:50 గంటలకు పరీక్ష బుక్‌లెట్లను పంపిణీ చేస్తారు. 2 గంటలకు పరీక్ష మొదలవుతుంది. పరీక్షకు నిమిషం లేటయినా అనుమతించరు. అందుకే విద్యార్థులు ముందు రోజే పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి చూసుకోవాలని, ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీబీఎస్‌ఈ సూచించింది.

పెన్నులు, పెన్సిళ్లను అనుమతించరు. అవసరమైన పెన్నులు పరీక్ష గదిలోనే అందిస్తారు. పరీక్ష గదిలోకి షూస్‌ను అనుమతించరు. షూస్ వేసుకొస్తే బయటే విడిచి వెళ్లాలి. చెప్పుల విషయంలో ఆంక్షల్లేవు. ఎలక్ట్రానిక్ వస్తువులు, రిస్ట్‌వాచీలను అనుమతించరు. పరీక్ష గదిలోనే గోడ గడియారాలను అందుబాటులో ఉంచుతారు. ఇన్విజిలేటర్లు కూడా సెల్‌ఫోన్లతో పరీక్ష హాల్లోకి వెళ్లడానికి వీల్లేదు.

సికింద్రాబాద్‌లోని ఒక పరీక్ష కేంద్రం చిరునామా తప్పుగా పడింది. హస్మత్‌పేట మెయిన్ రోడ్డు మనోవికాస్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం పేరు మొదట ‘పల్లని’ మోడల్ స్కూల్‌గా తప్పుగా పడిందని, దాన్ని ‘పల్లవి’ మోడల్ స్కూల్‌గా చ దువుకోవాలని సీబీఎస్‌ఈ సూచించింది.

9, 10 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష
జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ ఏర్పాట్లు చేసింది. ఇది పేపర్-1లో మాత్రమే ఉంటుంది. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

Advertisement
Advertisement