Sakshi News home page

నయీమ్‌ డైరీ ఏమైంది?

Published Tue, Dec 20 2016 1:46 AM

నయీమ్‌ డైరీ ఏమైంది? - Sakshi

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్, అతని అనుచరులు చేసిన అరాచకాలపై నమోదైన కేసుల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అల సత్వం ప్రదర్శిస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు నయీమ్‌ వద్ద లభించిన డైరీ ఏమైందని, అతడు హతమైన తర్వాత వేల కోట్ల రూపాయల డంప్‌తో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు దొరి కాయని వార్తలు వచ్చా యని, వాటి సంగతేంటని నిలదీశారు. సోమవారం శాసనసభలో నయీమ్‌ ఉదం తంపై జరిగిన లఘుచర్చను జీవన్‌ రెడ్డి ప్రారంభించారు. నయీమ్‌ లాంటి కరుడుగట్టిన నేరస్తుడిని హతమార్చడం మంచిదే అని అంటూనే ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు.

కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, నయీం వద్ద లభించిన డైరీని బహిర్గతం చేయాలని, అతని వద్ద లభించిన సామాన్లన్నిం టినీ కోర్టులో డిపాజిట్‌ చేయాలన్నారు. నయీమ్‌ బాధితుల ఆస్తులను అసలైన యజమానులకు అప్పగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నయీంను హతమార్చేందుకు రెండేళ్లు ఎందుకు పట్టింది? అన్ని రోజుల పాటు అతడ్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? తనకు తగిలితే కానీ దెబ్బ తెలియదన్నట్టు మీ వరకు వస్తే కానీ నయీమ్‌ను పట్టుకోవాలన్న ఆలోచన రాలేదా? నయీమ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత 2015లో ఇమామ్‌ గూడలో అతడి మేనకోడలు ఫంక్షన్‌ పెట్టి రాజకీయ నాయ కులను, పోలీసులను ఆహ్వానించిన విషయం ఇంటెలిజెన్స్‌ వర్గాలకు ఎందుకు తెలియలేదు? తెలిస్తే 2016 ఆగస్టు వరకు నయీమ్‌ను ఎందుకు ఉపేక్షించారు?’’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నిం చారు. ‘‘నయీమ్‌తో సంబంధాలున్నాయని చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి హోదాలో ఉన్న ఓ శాసనమండలి సభ్యుడి పేరును కూడా కేసులో ప్రస్తావించారు. అయినా నయీమ్‌ తో అంటకాగిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోంది’’ అని ఆయన ప్రశ్నలు సంధించారు.

సిట్‌ దర్యాప్తు చేయగలదా?
నయీమ్‌ నేర సామ్రాజ్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉందని, అలాంటప్పుడు సిట్‌ ఈ కేసును ఎలా దర్యాప్తు చేయగలుగుతుందని జీవన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నయీం వద్ద లభించిన ఏకే 47 తుపాకులు పాకిస్తాన్‌కు చెందిన హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ అనే సంస్థ నుంచి వచ్చాయని చెపుతున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి అధికారులు ఈ కేసును ఛేదించగలరా అని ప్రశ్నించారు. ‘‘నయీమ్‌తో సంబంధాలున్నవారిలో మీ వాళ్లుంటే మీకు మొహమాటం. మా వాళ్లుంటే ‘మీరు కక్ష సాధిస్తున్నారు’ అని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నియమించిన సిట్‌ ఏం చేయగలుగుతుంది? 18 మంది ఐపీఎస్‌ అ«ధికారులు, 8 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 42 మంది అధికారులకు సంబంధమున్న ఈ కేసును రాష్ట్ర పోలీసులు పూర్తి చేయగలుగుతారా? నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే కేసును వెంటనే సీబీఐకి అప్పగించండి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగి నాలుగు నెలలు దాటినా అతడి కుడిభుజంగా వ్యవహ రించిన శేషన్న ఏమయ్యాడని, ఎందుకు పట్టుకోలేక పోయారని ప్రశ్నించారు.

ఓటుకు కోట్లు కేసు ఏమైంది?
రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ గట్టిగా వ్యవహరించడం లేదని జీవన్‌రెడ్డి అన్నారు. ‘‘ఓటుకు నోటు కేసులో.. బాధ్యులైన వారు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని అన్నారు.. కానీ ఆ కేసు ఏమైంది? ఎవరు ఊచలు లెక్కపెట్టారు? సినిమా ట్రైలర్‌ లాగా వార్తలను బయటకు పంపిస్తారు. అసలు ఓటుకు నోటు కేసు మధ్యలో ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి. నయీమ్‌ డైరీతో పాటు అతని వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లు వీడియోటేపులన్నింటినీ బహిర్గతం చేయాలి. అప్పుడే వివరాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయి.

ఒకరిపై మరొకరు నెట్టుకోవడం కాదు: ప్రతిపక్షాలు
నయీమ్‌ అంశంపై జరిగిన చర్చలో కౌసర్‌ మొయినుద్దీన్‌ (ఎంఐఎం), చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ), సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ), సున్నం రాజయ్య (సీపీఎం)లతో పాటు అధికార టీఆర్‌ఎస్‌ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నయీమ్‌ కేసుతో సంబంధమున్న వారందరిపై చర్యలు తీసు కోవాలని, నయీమ్‌ను హతమార్చిన పోలీసులకు రివార్డు ఇవ్వాలని కోరారు. మీరేం చేశారంటే మీరేం చేశారని నిందలు మోపుకోకుండా కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలన్నారు. నయీమ్‌ బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని, నయీమ్‌ డైరీని బయటపెట్టాలని సండ్ర డిమాండ్‌ చేశారు. 

నయీమ్‌ విషయంలో చర్యలు వేగవంతం చేయాలని సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. నయీమ్‌ను టీడీపీ పెంచి పోషిస్తే, ప్రోటీన్లు, విటమిన్లు అందించింది కాంగ్రెస్‌ పార్టీనని సోలిపేట ఎద్దేవా చేశారు. నయీమ్‌ను హతమార్చి సీఎం.. 100 నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు కట్టినంత మంచి పని చేశారని ప్రశంసించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రేవంత్‌ కోరినా స్పీకర్‌ అంగీకరించలేదు. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడేందుకు లేచి నిలబడగా.. తాను మాట్లాడతానని రేవంత్‌ పట్టుబట్టారు. అయినా స్పీకర్‌ అవకాశం ఇవ్వకపోవడంతో ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి..’ అంటూ రేవంత్‌ కూర్చోవడంతో సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

Advertisement

What’s your opinion

Advertisement