వేతనంపై బేరమాడండి ఇలా... | Sakshi
Sakshi News home page

వేతనంపై బేరమాడండి ఇలా...

Published Sat, Aug 23 2014 12:03 AM

వేతనంపై బేరమాడండి ఇలా...

జాబ్ స్కిల్స్
 
మీ అర్హతలకు తగిన మంచి జాబ్ ఆఫర్ చేతిలో పడిందా? దాన్ని అలాగే జాగ్రత్తగా పట్టుకోండి. పొరపాట్లు చేసి, జారవిడుచుకోవద్దు. వేతనం విషయంలో పట్టిన పట్టు మీదే ఉండి కొందరు అవకాశాన్ని చేజేతులా వదులుకుంటారు. సంస్థలో ఉద్యోగం ఖాయమని తెలియగానే అభ్యర్థులు చేసే మొట్టమొదటి పని.. వేతనం గురించి బేరసారాలు ప్రారంభించడం. తెలిసినవాళ్లు కూడా నీ జీతం ఎంత? అని ప్రశ్నిస్తుంటారు. ఎవరైనా ఎక్కువ జీతం రావాలని ఆశించడం సహజమే. అయితే, ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సంస్థ మిమ్మల్ని వదులుకొని, మరొకర్ని ఉద్యోగంలో చేర్చుకుంటుంది. కోరినంత జీతాలిచ్చే పరిస్థితి ఉండదు. అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుకోవాలి. అదే సమయంలో తమ అర్హతలు, నైపుణ్యాలకు తగిన విలువ దక్కేలా చూసుకోవాలి.
 
మీ అసలైన విలువ ఎంత?


వేతనం అడగడానికంటే ముందు దీనిపై కొంత పరిశోధన చేయాలి. మీకు కొలువు లభించిన సంస్థలో, అదే రంగంలో ఉద్యోగులకు అందుతున్న వేతనాలు, శాలరీ ట్రెండ్స్ తెలుసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్ శాలరీ టూల్స్ ఉపయోగించుకోవాలి. సంస్థ నుంచి ఎంత ఆశించవచ్చో ఒక అవగాహన వస్తుంది. అంతేకాకుండా మీ అసలైన విలువ ఎంతో లెక్కకట్టాలి. మీలోని అర్హతలు, అనుభవం, నైపుణ్యాలకు మార్కెట్‌లో దక్కే విలువ ఎంతో తెలుసుకోవాలి.
 
టైమింగ్ ముఖ్యం

ఉద్యోగం రాగానే జీతం గురించి సంస్థతో మాట్లాడొద్దు. దీనివల్ల మీపై ప్రతికూల భావన ఏర్పడే ఆస్కారం ఉంది. యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలి. ఈలోగా జాబ్ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. సరైన సమయం చూసుకొని శాలరీ ప్యాకేజీ గురించి సంస్థ వద్ద ప్రస్తావించాలి. వేతనం అంటే నెలనెలా చేతిలో పడేది మాత్రమే కాదు. మొత్తం ప్యాకేజీని పరిశీలించండి. ఇందులో ఇతర రాయితీలు, ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి. కొన్నిసార్లు చేతిలో పడే వేతనం కంటే అవే ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని సంస్థల్లో వేతనం తక్కువైనా సరళమైన పనివేళలు ఉంటాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్నింటిపై అవగాహన పెంచుకున్న తర్వాతే అడగాల్సిన వేతనంపై తుది నిర్ణయానికి రావాలి.
 
పరిధులు తెలుసుకోండి

మీ అసలైన విలువ ఎంతో తెలుసుకున్న తర్వాత ఈ సంఖ్యకు కాస్త అటూఇటుగా సంస్థతో బేరమాడేందుకు ప్రయత్నించాలి. ఫలానా సంఖ్య నుంచి ఫలానా సంఖ్య వరకు జీతం ఆశిస్తున్నట్లు తెలియజేయండి. అయితే, ఈ విషయంలో పరిధుల్లోనే ఉండాలి. అసలు విలువ కంటే ఎక్కువ ఆశిస్తే సంస్థ మిమ్మల్ని వదులుకుంటుంది. మీ విలువ, మార్కెట్ స్థితిగతుల ప్రకారమే జీతం కోరడం మంచిది.
 
విజయం.. ఇద్దరిదీ!

వేతనంపై బేరసారాలు అంటే.. అభ్యర్థి, యాజమాన్యం మధ్య పోరాటం కాదు. ఇరువర్గాలకు సంతృప్తి కలిగించేలా శాలరీ ప్యాకేజీపై ఆఖరి నిర్ణయానికి రావాలి. చేస్తున్న పనికి సరైన విలువ దక్కిందన్న భావన మీకు, ఇస్తున్న జీతానికి సరైన ప్రతిఫలం లభిస్తోందన్న సంతృప్తి యాజమాన్యానికి కలగాలి. అప్పుడే ఉద్యోగి, యాజమాన్యం మధ్య బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది.
 
 

Advertisement
Advertisement