వ్యవసాయ బీమాలకు ఉమ్మడి నోటిఫికేషన్‌ | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బీమాలకు ఉమ్మడి నోటిఫికేషన్‌

Published Tue, Jan 30 2018 2:26 AM

Joint notification for farm insurance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా రెండింటికీ ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. సోమవారం పంటల బీమాపై జరిగిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీజన్‌లో ఉన్నట్లే వచ్చే ఖరీఫ్‌లోనూ పలు జిల్లాలకు సంబంధించిన 6 క్లస్టర్లను కొనసాగిస్తామన్నారు.

వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, సోయాబీన్, పసుపు, వేరుశెనగ పంటలు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద, పత్తి, మిర్చి, బత్తాయి, పామాయిల్‌ పంటలు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఉంటాయని తెలిపారు. నష్టపరిహారం కోసం చెల్లించే స్థాయిని 80 శాతంగానే నిర్ణయించామన్నారు. ఈ రెండు బీమాలను ఒకే బీమా కంపెనీ అందజేస్తుందన్నారు.

యూనిఫైడ్‌ ప్యాకేజీ స్కీం కింద గతంలో నిర్ణయించిన విధంగానే జిల్లాల్లో కొనసాగుతాయన్నారు. విధివిధానాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పంటల బీమా గడువు తేదీలు గత ఖరీఫ్‌ ప్రకారమే ఉంటాయన్నారు. సమావేశంలో వ్యవసాయ కమిషనర్‌ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
 
ప్రపంచ విత్తన భాండాగారం వైపు అడుగులు
తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ నూతన కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ధ్రువీకరణ, సేంద్రియ ధ్రువీకరణ విభాగాల ద్వారా ఏడాదిలో దాదాపు 17 వేల క్వింటాళ్ల జొన్న, వరి తదితర విత్తనాలను ఈజిప్టు, సూడాన్, వంటి దేశాలకు ఎగుమతి చేశామన్నారు.

వివిధ రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. దీన్ని గుర్తించిన కేంద్రం దక్షిణాది రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ అధికారులను తెలంగాణకు అప్పగించిందన్నారు. ఆన్‌లైన్‌ ధ్రువీకరణ పద్ధతితో కల్తీ విత్తనాల సరఫరాను నియంత్రించగలిగామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ విత్తన సదస్సు ఆసియా ఖండంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో జరగనుందని పార్థసారథి వెల్లడించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్, విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement