51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి | Sakshi
Sakshi News home page

51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి

Published Sun, Jun 7 2015 2:15 AM

51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి

8,191 మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంచిన కమలనాథన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకు 51 విభాగాల్లోని రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన 8,191 మంది ఉద్యోగులను కమలనాథన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. స్థానికత, ఆప్షన్లు, మార్గదర్శకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 4,359 మంది ఉద్యోగులను, తెలంగాణకు 3,832 మందిని కమిటీ కేటాయించింది.

తెలంగాణకు చెందిన 518 మంది ఉద్యోగులను ఆప్షన్లు, ఇతర నిబంధనల మేరకు కమిటీ ఏపీకి కేటాయించింది. అలాగే ఆంధ్రాకు చెందిన 246 మందిని ఆప్షన్లు, ఇతర నిబంధనల మేరకు తెలంగాణకు కేటాయించారు. పంపిణీ పూర్తి చేసిన 51 విభాగాల్లో ఏపీకి 6,462 పోస్టుల మంజూరవ్వగా.. పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా 4,359 మందిని కేటాయించారు. అలాగే తెలంగాణకు 51 విభాగాల్లో మంజూరైన పోస్టులు 4,329కు గాను పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా 3,832 మందిని కేటాయించారు.

తెలంగాణ నాల్గోతరగతి ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల్లో 287 మంది నాల్గోతరగతి ఉద్యోగులే ఉన్నారు. ఇలా ఉండగా మరో 17 విభాగాల్లో కూడా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కూడా పూర్తి అయింది. ఈ పంపిణీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. నెలాఖరుకు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ నూరు శాతం పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ప్రొవిజనల్ పంపిణీ జాబితాలను కేంద్రానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత ఉద్యోగుల తుది పంపిణీ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement