ఆల్మట్టి ఎత్తుపై కర్ణాటక రాజకీయం! | Sakshi
Sakshi News home page

ఆల్మట్టి ఎత్తుపై కర్ణాటక రాజకీయం!

Published Tue, Sep 5 2017 2:10 AM

ఆల్మట్టి ఎత్తుపై కర్ణాటక రాజకీయం!

కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు
- తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతుల కోసం ఒత్తిళ్లు
ఇప్పటికే కేంద్ర మంత్రిని కలసిన కర్ణాటక మంత్రులు
అనుమతులు సాధించి రాజకీయ లబ్ధి పొందే యత్నం
కేంద్రం తలొగ్గితే తెలంగాణ ఎడారే!  
 
సాక్షి, హైదరాబాద్‌: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు రాజకీయ రంగు పులుముకుంటోంది.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఆధారపడి చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు సాధించుకొనేందుకు కర్ణాటక ప్రభుత్వం రాజకీయ కోణాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు కర్ణాటక మంత్రులు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిని కలసి విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ పార్టీల పెద్దలు కూడా ఈ పథకాలకు అనుమతులు సాధించి.. ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తున్నారు.

బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచుకునేందుకు కర్ణాటక చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పెంపుతో అదనంగా లభించే నీటిని వినియోగించుకునేలా తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది. కానీ బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అవార్డు కాకపోవడం (అమల్లోకి రాకపోవడం)తోపాటు పలు ఇతర అంశాల నేపథ్యంలో ఈ ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. అయితే కర్ణాటక చేపట్టిన ఈ తొమ్మిది ఎత్తిపోతల పథకాల నుంచి పలువురు కీలక నేతలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందులో అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష బీజేపీ నేతల నియోజకవర్గాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నేతలంతా ఎత్తిపోతల పథకాలకు ఎలాగైనా అనుమతులు సాధించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తద్వారా ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్నారు. 
 
ప్రయత్నాలు మొదలు.. 
ఇటీవల కర్ణాటక మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రిని కలసి ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై విజ్ఞప్తులు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చిందని, అందువల్ల దానిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ పథకాలు పూర్తిచేస్తామని.. ట్రిబ్యునల్‌ తీర్పు అమల్లోకి వచ్చాకే నీటి విని యోగం మొదలుపెడతామని వివరించినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ కేంద్ర మంత్రులు సైతం.. ఆ ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై దృష్టి సారించినట్లు తెలిసింది. తాము అనుమతులు సాధించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు సమాచారం. 
 
కర్ణాటక ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే..
కర్ణాటక ప్రభుత్వం, అక్కడి నేతల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే.. కృష్ణా పరీవాహకంలో దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే విచ్చలవిడిగా నీటిని వినియోగించుకుంటున్న కర్ణాటక.. ఆ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని వినియోగించుకుంటే దిగువకు చుక్క నీరు కూడా రాదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు.  

Advertisement
Advertisement