కార్టింగ్ క్వీన్ | Sakshi
Sakshi News home page

కార్టింగ్ క్వీన్

Published Sun, Jul 27 2014 1:59 AM

కార్టింగ్ క్వీన్

రేసింగ్ అంటే మేఘాలలో తేలిపోవాలి. తూఫాన్‌లా చెలరేగిపోవాలి. మెరుపు వేగంతో దూసుకుపోవాలంటే గుండెల్లో గట్స్.. పట్టు తప్పని నియంత్రణ ఉండాలి. ఇది కండలు తిరిగిన వీరుడికి మాత్రమే సాధ్యం అనుకుంటే పొరపాటు. పదిహేనేళ్ల అమ్మాయి కార్టింగ్ రేసింగ్‌లో రయ్ మంటోంది. దేశంలోనే ఏకైక గర్ల్ కార్టింగ్ రేసర్‌గా సత్తా చాటుతోంది. శనివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ‘జేకే టైర్- ఎఫ్‌ఎంఎస్‌సీఐ నేషనల్ రోటెక్స్ మాక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్-2014’లో పాల్గొనేందుకు వచ్చిన మిర్రా ఎర్థను ‘సాక్షి సిటీప్లస్’ పలకరించింది.
 
బరోడాకు చెందిన మిర్రా ఎర ్థకు కార్టింగ్ ట్రాక్ కనిపిస్తే చాలు ఆమె కళ్లలో మెరుపు కనిపిస్తుంది. గేర్లు మార్చడం.. స్పీడ్ పెంచడంలో ఎంత పర్‌ఫెక్టో.. ట్రాక్ తప్పకుండా హ్యాండిల్ చేయడంలోనూ అంతే పర్‌ఫెక్ట్. కార్టింగ్ కారు ఎక్కిన మరుక్షణం ఆమె వేగానికి అంతకు మించిన పట్టుదలకు ల క్ష్యం చిన్నబోతుంది. మిర్రా కార్టింగ్ ప్రయాణం ఆమె మాటల్లోనే..
 ఆ మాటలే కసి పెంచాయి
 ‘ కార్టింగ్ మహామహులకే సాధ్యం కాదు.. ఆడపిల్లవి నువ్వేం చేస్తావ్’ ఈ మాటలు నేను కార్టింగ్ కారు ఎక్కిన రోజే వినిపించాయి. ఆ మాటలే నాలో కసి పెంచాయి. సొంతంగా కార్టింగ్ ట్రాక్ ఉండటంతో ఏడేళ్ల వయసు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్రాక్ ఎక్కేదాన్ని. 2012లో తొలిసారి మైక్రో మాక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని మూడో స్థానంలో నిలిచాను.  కార్టింగ్‌తో ఏకాగ్రత పెరుగుతుంది. వేగంగా వెళ్లే వాహనాన్ని కంట్రోల్ చేయాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. అందుకే రోజూ మెడిటేషన్, ప్రేయర్ చేస్తా.
 తొలి మహిళ ఫార్మూలా-1 రేసరే లక్ష్యం
 
 దేశంలోనే తొలి మహిళా ఫార్మూలా-1 రేసర్ కావాలనేది నా లక్ష్యం. ఈ రేసింగ్‌లో పాల్గొనాలంటే కనీసం 15 ఏళ్లు ఉండాలి. ఇప్పుడు నాకు 15 ఏళ్లు. ఈ ఏడాది ఫార్మూలా ఎఫ్‌బీజెడ్, ఫార్మూలా బీఎండబ్ల్యూ రేసింగ్‌లో పాల్గొంటున్నాను. ఇందు కోసం రోజూ 6 గంటలకు పైగా ప్రాక్టీస్ చేస్తున్నా. భయం వీడి అమ్మాయిలు కూడా కార్టింగ్ స్పోర్ట్స్‌లోకి రావాలి. ఈ దిశగా తల్లిదండ్రులూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నా.
  శ్రీనాథ్ ఆడెపు
 
 3.
 

Advertisement
Advertisement