ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు ఆదర్శనీయం: కేసీఆర్ | Sakshi
Sakshi News home page

ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు ఆదర్శనీయం: కేసీఆర్

Published Mon, Nov 17 2014 1:08 AM

ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు ఆదర్శనీయం: కేసీఆర్ - Sakshi

హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు సమాజానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తార్నాక విజయపురి కాలనీలో ఇటీవల నూతన హంగులతో నిర్మించిన సరోజిని నాయుడు వనితా ఫార్మసీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సరోజిని నాయుడు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. నిజాం పాలనలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీని నాటి ‘బాగ్-ఈ-ఆమ్’ నేటి పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనంతరం ఇప్పుడున్న స్థలంలో ఎగ్జిబిషన్ సొసైటీని మార్చారని పేర్కొన్నారు. ఈ సొసైటీ తెలంగాణ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు 19 విద్యాసంస్థలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు.

ఢిల్లీలోని ప్రగతి మైదానికి దీటుగా ఎగ్జిబిషన్ మైదానం వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, మాజీ శాసన సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె శోభన్‌రెడ్డి, కళాశాల చైర్మన్ పి. హరినాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వి. జ్యోతి, సెక్రటరీ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement