మా పాత్రేమీ లేదు.. | Sakshi
Sakshi News home page

మా పాత్రేమీ లేదు..

Published Sat, Apr 7 2018 2:46 AM

Komatti Reddy and Sampath government report to the High Court  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వ రద్దు, వారు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ, అలంపూర్‌ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్‌ జారీ వ్యవహారంలో తమ పాత్రేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ‘వారు దురభిప్రాయంతో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారు. పైగా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలివ్వాలని కోరారు తప్ప మాకు నిర్దిష్ట ఆదేశాలివ్వాలని కోర్టును కోరలేదు.

కాబట్టి మాపై వ్యాజ్యాన్ని పిటిషనర్లకు జరిమానా విధించి మరీ కొట్టేయండి’ అని కోర్టును అభ్యర్థించింది! తమ శాసనసభ్యత్వాల రద్దును, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి, సంపత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయడం తెలిసిందే. హెడ్‌ ఫోన్‌ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచామన్నందున సంబంధిత వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కూడా వారు కోర్టును కోరారు.

కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశాయి. 3 పేజీల ప్రభుత్వ కౌంటర్‌లో ఈ వ్యవహారంలో భవిష్యత్తులోనూ తమ ప్రమేయం ఉండబోదని తెలిపింది. ఇక, పిటిషనర్లు తమపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు గనుక సభలో జరిగిన ఉదంతంపై బదులివ్వాల్సిన అవసరం లేదని ఈసీ తన 4 పేజీల కౌంటర్లో తెలిపింది. ‘మీ ఆదేశాల మేరకు నల్లగొండ, అలంపూర్‌ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహణపై మేం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాబట్టి మాపై వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని కోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి సోమవారం నుంచి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు.

Advertisement
Advertisement