ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి

Published Sun, Feb 7 2016 2:30 AM

ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి - Sakshi

సిద్ధంగా ప్రణాళికలు
పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచుతాం
అవినీతికి అడ్డుకట్ట వేస్తాం
కార్పొరేటర్లు వెంటనే కార్యరంగంలోకి దిగాలి
పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తా
‘సాక్షి’తో మంత్రి కేటీఆర్


సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నామని, దీనికి తగిన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలకు ఈ అయిదేళ్లలో కంటికి కని పించేలా అభివృద్ధిని చేసి చూపెడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రచార సారథ్య బాధ్యతలను మంత్రి కేటీఆర్  నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా తన వద్ద ఉన్న మున్సిపల్ శాఖ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ గత నెల 30న జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభావేదికపై ప్రకటించిన నేపథ్యంలో నేడో, రేపో మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న మంత్రి కేటీఆర్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ ప్రణాళికలను గురించి వివరించారు.

 ప్రజల భాగస్వామ్యంతో ముందుకు..
హైదరాబాద్‌కు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సమస్యలున్నాయని, డబుల్‌బెడ్ రూం ఇళ్లకు కావాల్సిన స్థలాలు లేకపోవడం, పార్కుల కొరత, పుట్ పాత్‌ల లేమి వంటి వాటిపై దృష్టిపెడతామని కేటీఆర్ అన్నారు. వాస్తవానికి ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని, దీనికోసం పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచడంపై దృష్టిపెడతామని చెప్పారు. ఇందులో భాగంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మాదిరిగానే నైబ ర్ హుడ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. కార్పొరేషన్‌లో పనిచేసే వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించాల్సి ఉందన్నారు. పబ్లిక్ హెల్త్, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, జెన్‌కో, హెచ్‌ఎండబ్ల్యూఎస్, ఇంజనీరింగ్  విభాగాలతో జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసి, వీటిల్లో కార్పొరేటర్లను భాగస్వాములుగా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

 టెక్నాలజీతో అవినీతి ప్రక్షాళన: కార్పొరేటర్లలో జవాబుదారీ తనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రజల ప్రాధాన్యమే వారి ప్రాధాన్యం ఆయ్యేలా మార్పులు తెస్తామని కేటీఆర్ అన్నారు. అవినీతి చీడ వదిలించేందుకు టెక్నాలజీని వాడుకుంటామని, దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎవరి చేయి తడపాల్సిన పనిలేకుండా పనులు కావాలని, జీహెచ్‌ఎంసీలో పైసా ఇవ్వకుండా సామాన్యుడికి పనులు జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ మార్పులు సమూలంగా జరిగితే పాలనలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజలకు మౌలిక సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని, చివరకు పెద్ద రోడ్లలో కూడా ఫుట్ పాత్‌లు లేవని అన్నా రు. ట్రాఫిక్ రద్దీతో రోడ్లు దాటేవారు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌లో అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని మురికి వాడలను అభివృద్ధి చేస్తామని, అక్కడి ప్రజలకు వారి ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు.

అయిదేళ్లలో చేసి చూపిస్తాం..
నగరంలో కార్పొరేటర్లుగా గెలిచిన వారంతా వెంటనే కార్యరంగంలోకి దిగాలని మంత్రి కేటీఆర్ కోరారు. తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ‘గతంలో నగరాన్ని ఏలిన పార్టీలు యాభై ఏళ్లలో చేయలేని పనిని అయిదేళ్లలో చేస్తామని చెప్పాం. ఆ హామీని నిజం చేసేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతాం’ అని కేటీఆర్ వివరించారు.

Advertisement
Advertisement