భూసేకరణకు చెక్! | Sakshi
Sakshi News home page

భూసేకరణకు చెక్!

Published Fri, Aug 7 2015 2:38 AM

భూసేకరణకు చెక్! - Sakshi

ఆర్డినెన్స్ ఉపసంహరణ యోచనలో కేంద్రం
♦  అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ చెల్లుబాటు కాదు
♦  అమల్లోకి 2013 భూసేకరణ చట్టం
♦  దీని ప్రకారం బహుళ వార్షిక పంటలు పండే భూములను సేకరించరాదు
♦  80% ప్రజల మద్దతు అనివార్యం
♦  సామాజిక ప్రభావం మదింపు చేయాలి
♦  అయినా సేకరించాలంటే ఎకరాకు రూ. 5 కోట్లు చెల్లించాలి
♦  11 వేల ఎకరాలను సేకరించాలంటే దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయం


సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాస, పునరుపాధి కల్పన చట్టానికి (2013) సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటే రాష్ట్ర రాజధానికి భూ సేకరణకు బ్రేక్ పడుతుందంటున్నారు న్యాయవాద, హక్కుల సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు ఆర్డినెన్స్‌ను జారీ చేసినా పార్లమెంటులో చట్టం కాకపోవడంతో ప్రభుత్వం దాదాపు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది.

పూర్తిగా ఉపసంహరించుకోకుండా వివాదాస్పదమైన కీలకాంశాలను సడలించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 14న- కేంద్రం ఆర్డినెన్స్ ఆధారంగా భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు విలువ లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ఉపసంహరించుకుంటే అమల్లోకి వచ్చే 2013నాటి భూసేకరణ చట్టప్రకారం రాజధానికి 11 వేల ఎకరాలను సేకరించాలంటే ప్రభుత్వం కనీసం రూ.60 వేల కోట్లు రైతులకు చెల్లించాలని, సహాయ పునరావాస పథకానికి మరో 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు.
 
80 శాతం మంది రైతులు ఆమోదిస్తేనే...
2013 నాటి భూ సేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ మదింపు అనివార్యం. ప్రైవేటు వ్యవహారమైతే 80 శాతం మంది, పబ్లిక్ వ్యవహారమైతే 70 శాతం మంది భూ యజమానుల అనుమతివ్వాలి.  సర్వే, నిపుణుల కమిటీ పరిశీలన జరగాలి. దీనికి11 నెలల గడువు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో  భూ సేకరణ మొదలు పెడితే 2016 ఆగస్టునాటికి కానీ పూర్తికాదు.
 
పంట పొలాలు తీసుకునే వీలు లేదు...
చట్టంలోని మూడో అధ్యాయం సెక్షన్ 10-ఎ ప్రకారం బహుళ పంటలు పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. గత్యంతరం లేక తీసుకుంటే దానికి సమానమైన భూమిని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం రాజధానికి గుర్తించిన 29 గ్రామాల్లో (మరో నాలుగు గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది) లక్షా 40 వేల మంది జీవనోపాధి కోల్పోతారు. 90 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. దీన్ని మదింపు చేయాలి. సహాయ పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్)ని అమలు చేయాలి. నిర్వాసితులకు పూర్తి ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి. బాబు ప్రభుత్వం  ఈ ప్యాకేజీ ఊసెత్తకుండా భూసమీకరణ చేస్తోంది. కేంద్రం ఆర్డినెన్స్ రద్దయితే  రూ.వేల కోట్లు అవసరమవుతాయి.
 
పరిహారానికే రూ.70 వేల కోట్లు కావాలి...
రాజధాని ప్రాంతంలో 44 వేల ఎకరాల భూ సమీకరణకు రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి 22 వేల ఎకరాలు సమీకరించినట్టు ప్రకటించింది. మిగతాదాన్ని భూ సేకరణ చట్టం కింద తీసుకుంటామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఒకే ప్రయోజనం (రాజధాని నిర్మాణం) కోసం రెండు నోటిఫికేషన్లు, వేర్వేరు చట్టాలను ప్రయోగిస్తోంది. భూ సమీకరణ పథకం కింద భూమి ఇచ్చిన జరీ భూముల రైతులకు ఒక ఎకరానికి 1450 గజాలు, మెట్టరైతులకు 1200 గజాల అభివృద్ధి చేసిన భూమిని, ఏటా రూ. 50 వేలుచొప్పున కౌలు ఇస్తామని ప్రకటించింది.

2013 చట్టం ప్రకారం భూమిని సేకరిస్తే మార్కెట్ విలువ ్ఠ1.25 ఫార్ములా (ఏపీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్) (తెలంగాణ అయితే 2, మహారాష్ట్ర అయితే 5) ప్రకారం పరిహారం చెల్లించాలి. దీంతోపాటు భూమి ఇచ్చిన వారికి సాంత్వన (సొలాషియమ్) కింద వంద శాతం ఇవ్వాలి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో వేసేంతవరకు 19 శాతం వడ్డీ కలపాలి. తుళ్లూరులో ఎకరం భూమి విలువ రూ.రెండు కోట్లుగా నమోదైంది.

తాడికొండ, మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈమేరకు ఆధారాలున్నాయి. దీన్ని బట్టి 2013 భూ సేకరణ చట్టం కింద ఎకరం ఉన్న రైతుకు మార్కెట్ విలువ కింద రెండు కోట్లు, మల్టిప్లికేషన్ ఫార్ములా కింద 50 లక్షలు (మొత్తం 2.5 కోట్లు), సోలాషియమ్ కింద రెండున్నర కోట్లు... ఇలా ఎకరానికి రూ. ఐదు కోట్లు చెల్లించాలి. డబ్బు పూర్తిగా చెల్లించేవరకు 19 శాతం వడ్డీని కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి పోను మిగతా 11 వేల ఎకరాలను సేకరించాలంటే కనీసం రూ.60 వేల  కోట్లు చెల్లించాలి.  

పునరావాస పథకానికి మరో రూ. 20 నుంచి 30 వేల కోట్లు కావాల్సి ఉంది. భూ సమీకరణ కింద ఇచ్చిన రైతులకే కౌలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ఎలా తీసుకువస్తుందో అంతుబట్టని విషయమని రైతు సమాఖ్య కన్వీనర్, హక్కుల సంఘం నాయకుడు మల్లెల శేషగిరిరావు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement