మామిడి..మరింత లేట్! | Sakshi
Sakshi News home page

మామిడి..మరింత లేట్!

Published Mon, Apr 4 2016 5:13 AM

మామిడి..మరింత లేట్! - Sakshi

కార్బైడ్హ్రిత పండ్ల కోసం నగరవాసుల ఎదురు చూపులు
ఇంకా మార్కెట్‌లోకి రాని మామిడి
మరో వారం, పది రోజులు పట్టే అవకాశం
ఈ ఏడాది కొంతమేర పెరుగనున్న ధరలు
కార్బైడ్‌పై నిషేధం నేపథ్యంలో ఇథిలిన్ చాంబర్‌ల కోసం సన్నాహాలు

 

సిటీబ్యూరో:   మధురమైన మామిడి ఫలాల కోసం నగరవాసులు మరి కొంతకాలం ఎదురు చూడకతప్పడం లేదు. మార్చి ఆరంభంలోనే మార్కెట్‌కు రావలసిన మామిడి పళ్లు మరో  వారం, పది రోజులు గడిస్తే  తప్ప అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వేసవి వచ్చిందంటే చాలు  ప్రతి ఒక్కరు కమ్మని  బంగినపల్లి మామిడి పళ్ల  కోసం ఎదురు చూస్తారు. ఏడాదంతా  వివిధ రకాల ఫలాలు  లభించినప్పటికీ అందరూ ఎంతో ఇష్టంగా ఆరగించే మామిడి పళ్ల మజాయే వేరు. అయితే ఈసారి ఆ మధురమైన రుచులు కాస్త ఆలస్యంగానే  అందనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల  ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గిపోవడం, కార్బైడ్హ్రితమైన,  సహజ మామిడి పళ్ల  కోసం  ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వంటి కారణాల వల్ల  మామిడి వినియోగంలో జాప్యం  చోటుచేసుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మామిడి పళ్ల వినియోగ కాలపరిమితి కూడా గతంలో కంటే తగ్గే అవకాశం కనిపిస్తుంది. మార్చి నుంచి జూన్ నెలాఖరు వరకు  మార్కెట్‌లో అందుబాటులో ఉండాల్సిన మామిడి పళ్ల సీజన్ ఈ సారి ఏప్రిల్, మే నెలలకే పరిమితమయ్యేలా ఉంది. గతంలో కంటే ధరలు సైతం 10 శాతం నుంచి  15  శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

 
కార్బైడ్ స్థానంలో ఇథిలీన్...

విజయవాడ, ఉభయ గోదావరులు, కృష్ణా, కర్నూలు, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి ప్రతి రోజు హైదరాబాద్‌కు మామిడి దిగుమతి అవుతుంది. గత సంవత్సరం మార్చి నెలలో సుమారు 333 టన్నులు కొత్తపేట  గడ్డిఅన్నారం మార్కెట్‌కు అమ్మకానికి రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 10 టన్నులు కూడా రాలేదు.  పంట తగ్గడం ఒక కారణమైతే,  కార్బైడ్ స్థానంలో అందుబాటులోకి రావలసిన ఇథిలిన్ గ్యాస్ చాంబర్‌లు ఇంకా ఏర్పాటు కాకపోవడం మరో కారణం. దీంతో  పచ్చిమామిడి కాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇథిలిన్  విషయంలోనూ మరింత స్పష్టత రావాలని  కోరుతున్నారు. 16 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న ఇథిలిన్ గ్యాస్ చాంబర్‌లను ఏర్పాటు చేసేందుకు రూ.80 లక్షలతో మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేపట్టింది. మరోవైపు  వ్యాపారులు తమ షాపుల్లో  పచ్చిమామిడి కాయలను మగ్గబెట్టుకొనేందుకు  వీలుగా  10 మెట్రిక్ టన్నుల  ఇథిలిన్ గ్యాస్ చాంబర్‌లను ఏర్పాటు చేసేందుకు సైతం ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. అయితే  ఇవి ఏర్పాటు కావడానికి మరో 15 రోజులు పట్టవచ్చని అ దికారులు చెబుతున్నారు. ఆ  రకంగా కూడా  కార్బైడ్ రహితమైన మామిడి పళ్ల  రాక ఆలస్యమవుతోంది.

 
పెరుగనున్న ధరలు...

మరోవైపు  గతేడాది కంటే  ఈసారి  మామిడి పళ్ల ధరలు కూడా కొంత మేరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో  కిలో రూ.80తో  ప్రారంభమై  క్రమంగా  మే, జూన్ నాటికి  రూ.30 లకు తగ్గిన మామిడి పళ్ల ధర  ఈసారి కిలో రూ.100 నుంచి రూ.80 వరకు ఉండవచ్చునని  మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మామిడి పళ్ల సీజన్ తగ్గనున్న నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. గతంలో కార్బైడ్ వినియోగం వల్ల వ్యాపారులు మార్కెట్  అవసరాల మేరకు దశలవారీగా పచ్చి మామిడి కాయలను మగ్గబెట్టి అటు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో పాటు, ఇటు చిల్లర వర్తకులకు విక్రయించారు. కానీ ఈ సారి అందుకు అవకాశం ఉండదు. ఇథిలిన్ వల్ల  రైతు దగ్గర నుంచి వచ్చినవి వచ్చినట్లే మూడు, నాలుగు రోజుల్లో మగ్గిపోయి ఒకేసారి పెద్ద మొత్తంలో అమ్మకానికి సిద్ధమవుతాయి. మరోవైపు వ్యాపారులు  స్థానికంగా విక్రయించడం కంటే  పంజాబ్, హర్యాన, శ్రీనగర్, జమ్ము, ఢిల్లీ వంటి  ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకే మొగ్గు చూపుతారు. దీంతో స్థానిక మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గిపోవడం ఒకవైపు అయితే, మరోవైపు ఒకేసారి పెద్ద మొత్తంలో మగ్గబెట్టడం వల్ల మామిడి పళ్ల సీజన్ (వినియోగ కాలపరిమితి) కూడా తగ్గనుంది.


ప్యాకెట్ల రూపంలో ఇథిలీన్ అందుబాటులోకి తేవాలి....
ఇలా ఉండగా, గ్యాస్ చాంబర్‌ల కంటే ఇథిలిన్‌ను ప్యాకెట్‌ల రూపంలో అందుబాటులో ఉంచాలని వ్యాపారులు కోరుతున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా  రైతుల నుంచి మామిడి కాయలను కొనుగోలు చేసి మగ్గబెట్టేందుకు ఇథిలిన్  ప్యాకెట్‌లు  అనుకూలంగా ఉంటాయని  పేర్కొంటున్నారు. ఎగుమతులకు కూడా  ఇథిలిన్ ప్యాకెట్లను వినియోగించవచ్చునని  అభిప్రాయపడుతున్నారు. ఈ  అంశంపై  ప్రభుత్వం నుంచి స్పష్టత రావలసి ఉంది.

Advertisement
Advertisement