మున్సిపాలిటీలకు ‘ఎల్‌ఈడీ’ వెలుగులు | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలకు ‘ఎల్‌ఈడీ’ వెలుగులు

Published Wed, Mar 2 2016 4:22 AM

మున్సిపాలిటీలకు ‘ఎల్‌ఈడీ’ వెలుగులు

తొలి దశలో 25 మున్సిపాల్టీల్లో ప్రారంభం
6 లక్షల కుటుంబాలకు 12 లక్షల బల్బులు: కేటీఆర్

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 25 మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ ధగధగలు క నువిందు చేయనున్నాయి. రాబోయే 100 రోజుల్లోగా ఎల్‌ఈడీ బల్బుల బిగింపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం మున్సిపల్‌మంత్రి కె.తారకరామారావు, విద్యుత్ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మున్సిపల్, డిస్కంల అధికారులతో జరిగిన సమావేశంలో ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేసే ఈఎస్‌ఎస్‌ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 25 మున్సిపాల్టీల్లోని ఆరు లక్షల కుటుంబాలకు సుమారు 12 లక్షల ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేయనున్నామని, సాధ్యమైనంత తక్కువ ధరకు అందించాలని ఈఎస్‌ఎస్‌ఎల్ ప్రతినిధులను మంత్రి కోరారు. గ్రామ పంచాయతీల్లోనూ ఈ తరహా ప్రయత్నానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రెండో దశలో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీధి దీపాలకు, మూడో దశలో ప్రజలందరికీ సబ్సిడీపై ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.

 ఇంధన పొదుపే లక్ష్యం...
 విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంధన పొదుపు లక్ష్యంగా పెద్దెత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. త్వరలోనే నల్గొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎల్‌ఈడీ బల్బుల బిగింపు కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ చేపడుతుందన్నారు. ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్‌ఈడీ బల్బులను ప్రజలకు ఉచితంగా సరఫరా చేయనున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిస్కం, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement