సుప్రీం తీర్పు మేర నడుచుకోండి | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పు మేర నడుచుకోండి

Published Sat, Sep 10 2016 12:59 AM

సుప్రీం తీర్పు మేర నడుచుకోండి - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి వివాదాస్పదమైన ఆరు ప్రశ్నలను పక్కనపెట్టి మిగిలిన 144 జవాబులనే పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని టీఎస్‌పీ ఎస్సీ, ఏపీపీఎస్సీలను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాము మరోసారి ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘కీ’ లో తప్పుల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ తుది ‘కీ’లో 6 ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఉన్నాయం టూ కొందరు అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

విచారణ జరిపిన ట్రిబ్యునల్ 4 ప్రశ్నల విషయంలోనే కమిటీని ఏర్పా టు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేయడంతోపాటు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు ప్రస్తుత ఇంటర్వ్యూలను నిలిపేయాలని హైదరాబాద్‌కు చెందిన కె.ప్రసాద్, సి.హెచ్.నాగమురళీకృష్ణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్వ్యూలను కొనసాగించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునేంత వరకు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయవద్దని ఏపీపీఎస్సీని ఆదేశించిం ది. తుది ‘కీ’లో వివాదాస్పదంగా మారిన డీ సీరీస్‌లోని 4 ప్రశ్నల విషయంలో ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ 4 ప్రశ్నల వ్యవహారాన్ని యూపీఎస్‌సీకు నివేదించింది. దీనిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకుని నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీపీఎస్సీ సుప్రీంలో సవాల్ చేయగా వాదనలు విన్న కోర్టు వివాదాస్పద 6 ప్రశ్నలను పక్కనపెట్టి మిగిలిన 144 జవాబులనే పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది.

Advertisement
Advertisement