వెయ్యి ‘లైక్‌’లు పడితే.. లక్ష లోన్‌! | Sakshi
Sakshi News home page

వెయ్యి ‘లైక్‌’లు పడితే.. లక్ష లోన్‌!

Published Mon, Aug 14 2017 2:37 AM

వెయ్యి ‘లైక్‌’లు పడితే.. లక్ష లోన్‌!

  • లైక్‌లతో నడిచొచ్చే పర్సనల్‌ లోన్‌
  • ఎంత రుణమిస్తారు..  25,000  1,00,000
  • వడ్డీ 3%.. ఏ వయసు వారికి..  2160
  • ‘సలాం లోన్స్‌’పేరిట వినూత్న సదుపాయానికి శ్రీకారం చుట్టిన టాటా క్యాపిటల్‌
  • లైక్‌లు పడితే రుణమిస్తారా.. అని ఆశ్చర్యపోకండి! మీరు చదివింది అక్షరాలా నిజమే. లైక్‌లు వెయ్యికి మించితే వ్యక్తిగత రుణమిచ్చేందుకు రెడీ అంటున్నాయి కొన్ని ప్రైవేటు ఆర్థిక సంస్థలు. అయితే ఈ లోన్‌ మీ దరికి చేరాలంటే షరామామూలుగా కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి. రుణం పొందేందుకు చేయాల్సిందల్లా  www.doright.in వెబ్‌సైట్‌లో మీ యథార్థ గాథకు అక్షరరూపం ఇవ్వడం లేదా మీ పరిస్థితిని వివరిస్తూ వీడియోను పోస్ట్‌ చేయడమే! మీ గాథకు ఆ వెబ్‌సైట్‌లో వెయ్యి కంటే ఎక్కువ లైకులు వస్తే రూ. లక్ష రుణం అందిస్తోంది టాటా క్యాపిటల్‌ సంస్థ. ఆ కథేంటో మీరే చూడండి..

    సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ధనలక్ష్మి భాయ్‌ వృత్తిరీత్యా టైలర్‌. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి జీవిస్తోంది. అతడికి కూడా ఉద్యోగం లేకపోవడంతో బతుకు భారమైంది. తెలిసిన వారి సాయంతో తన దుర్భర పరిస్థితికి అక్షర రూపమిస్తూ టాటా క్యాపిటల్‌ వెబ్‌సైట్‌లో ఆమె ఇటీవల ఓ పోస్టు చేసింది. దాన్ని పరిశీలించిన నిర్వాహకులు ఆ పోస్టును తమ సైట్‌లోని ‘సలామ్‌ స్టోరీస్‌’ పేజీలో పెట్టారు.

    ఆమె యథార్థ గాథకు వెయ్యి మంది చలించారు. లైక్‌లు(సలామ్‌) కొట్టారు. ఈ లైకులు చూసి టాటా క్యాపిటల్‌ సంస్థ.. టైలరింగ్‌ దుకాణం పెట్టుకునేందుకు ధనలక్ష్మికి రూ.లక్ష రుణం మంజూరు చేసింది. ఈ రుణాలకు సదరు సంస్థ ‘సలామ్‌ లోన్స్‌’అని నామకరణం చేయడం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో ఈ వినూత్న రుణ సదుపాయానికి శ్రీకారం చుట్టినట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. నిరుపేదలు, చేతివృత్తిదారులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతిలో చితికిపోతున్న బాధితులకు అండగా నిలిచేందుకే సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి వినూత్న రుణ ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

    ఇదే బాటలో మరిన్ని సంస్థలు?
    ఇటీవలి కాలంలో వ్యక్తిగత, వాహన, గృహ రుణాల జారీలో ప్రైవేటు ఆర్థిక సంస్థలు, ప్రైవేటు బ్యాంక్‌లు, బ్యాంకింగేతర సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వినూత్న రుణ జారీ ప్రక్రియలను పలు ఆర్థిక సంస్థలు ప్రారంభించే అవకాశాలున్నట్లు బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి రుణ చేయూత దొరికితే స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుపేదలు, అల్పాదాయ వర్గాలు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

    పూర్తి పారదర్శకంగా..
    ఇవి పూర్తిగా పారదర్శకంగా జారీ చేసే రుణాలని సదరు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రుణ జారీకి సంబంధించిన దరఖాస్తులు పూరించడం, పూచీకత్తు పత్రాల వంటి అంశాల్లో రుణ గ్రహీతలకు సాయపడతామని చెబుతున్నారు నిర్వాహకులు. ఇప్పటివరకు 700–800 మంది నిరుపేదలు రుణాల కోసం తమ దీనగాథలను సంస్థ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసినట్లు తెలిసింది. మరో ఏడాదిలో ఈ సంఖ్య రెట్టింపు కానుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

    అర్హతలు, నిబంధనలు ఇవీ..

    • ఈ విధానంలో వ్యక్తిగత రుణాలు మాత్రమే మంజూరు చేస్తారు
    • తమ కుటుంబ, వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఉండే ఫొటోలు, అందుకు సంబంధించిన వివరాలు, వీడియోలు, రుణంతో తాము ఏం చేయాలనుకుంటున్నదీ వివరిస్తూ సదరు సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి
    • ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారే రుణం పొందేందుకు అర్హులు
    • రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు కూడా అర్హులే
    • రుణం జారీ స్థాయి రూ.25 వేల నుంచి రూ.లక్షలోపు మాత్రమే. వడ్డీరేటు పావలా.
    • రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి
    • రుణ గ్రహీతల యథార్థ గాథకు (కథనానికి) వెయ్యి లైక్స్‌ (సలామ్స్‌)రావాలి
    • ఇలాంటి రుణాలను పొందినవారు ఐదు నుంచి ఆరేళ్ల కాల వ్యవధిలో వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఉంటుంది
    • ఏడాది తర్వాత ఈ రుణాల జారీతో లబ్ధి పొందినవారి వివరాలు బహిర్గతం చేయడంతోపాటు, పథకంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నారు
    • ప్రధానంగా కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు, చేతివృత్తిదారులు, మహిళలకు ఇలాంటి రుణాలు ఆదరువుగా నిలవనున్నాయి

Advertisement
Advertisement