లేదు.. లేదంటూనే మూత! | Sakshi
Sakshi News home page

లేదు.. లేదంటూనే మూత!

Published Thu, Jul 27 2017 12:36 AM

లేదు.. లేదంటూనే మూత!

సర్దుబాటు పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత.. సమీపంలోని స్కూళ్లలో చేరాలని విద్యార్థులకు సూచన
 
రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా మూసివేయలేదు.. మూసివేసేది లేదు.. విద్యార్థులు వస్తే సున్నా పాఠశాలలనూ కొనసాగిస్తున్నాం..
– ఇటీవల డీఈవోల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాటలివీ..
 
స్కూళ్ల మూసివేతకు, సర్దుబాటుకు మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.. క్షేత్రస్థాయిలో ఎలా మూసేస్తారు..
– పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ వ్యాఖ్యలివీ..
 
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లను విలీనం చేస్తున్నాం.. విద్యార్థులు ఉన్న చోటికి టీచర్లు డిప్యుటేషన్‌పై వెళ్లాల్సిందే.
– ఇటీవల రెండు జిల్లాల్లో పాఠశాలలను మూసేసిన డీఈవోలు టీచర్లకు జారీ చేసిన ఆదేశాలివీ.
 
సాక్షి, హైదరాబాద్‌: మొన్న సూర్యాపేట్‌లో.. నిన్న పెద్దపల్లిలో.. డీఈవోలు స్కూళ్లను మూసేశారు. తక్కువ మంది ఉన్నారన్న సాకుతో ఉన్న విద్యార్థులను ఇతర స్కూళ్లకు వెళ్లిపోవాలని చెప్పారు. వాటిల్లో పనిచేస్తున్న టీచర్లు డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు వెళ్లాలని ఆదేశించారు. అవే కాదు మిగతా జిల్లాల్లోనూ క్షేత్ర స్థాయిలో సర్దుబాటు పేరుతో పాఠశాలల మూసివేతకు డీఈవోలు రంగం సిద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మే 31న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ ఈనెల 19న జారీ చేసిన నోట్‌ ఆర్డర్స్‌ ప్రకారం.. పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లిలో స్కూల్‌ మూసివేస్తున్నట్లు ఆ జిల్లా డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులు, 9 మంది టీచర్లు ఉన్నారు. అందులోని టీచర్లు ఇతర పాఠశాలలకు వెళ్లాలని స్పష్టం చేశారు. అయితే తమ స్కూల్‌ మూసివేతను నిరసిస్తూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. స్కూల్‌ బిల్డింగ్‌ ఎక్కి తమ పాఠశాలను కొనసాగించాల్సిందేనంటూ నిరసన తెలిపారు. అయినా అధికారులు ఆ స్కూల్‌ను మూసివేసేందుకు చర్యలు చేపట్టారు.
 
మిగతా జిల్లాల్లోనూ మొదలైన కసరత్తు..
ఈ రెండు జిల్లాల్లోనే కాదు.. మిగతా జిల్లాల్లోనూ స్కూళ్ల మూసివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పది మంది లోపు విద్యార్థులు ఉన్న 23 స్కూళ్లను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 20 మందిలోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 33 ఉన్నట్లు లెక్కలు తేల్చారు. మరో 11 ఉన్నత పాఠశాలలను కూడా మూసివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలో 10 మందిలోపున్న ప్రాథమిక పాఠశాలలు, 20 మందిలోపున్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 మందిలోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలను మొత్తంగా 5 వేల వరకు స్కూళ్లను మూసివేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
 
సమీపంలో స్కూళ్లు లేకుంటే ‘చార్జీలు’
ప్రస్తుతం మూసివేస్తున్న పాఠశాలలకు నిర్ణీత దూరంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే రవాణా చార్జీలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలకు 1 కిలోమీటర్‌ దూరంలో, ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరంలో, ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ఆయా పాఠశాలకు చెందిన విద్యార్థులకు రవాణా చార్జీలు ఇచ్చి మరింత దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
20 మందిలోపు ఉన్న పాఠశాలలు 4,637
ప్రస్తుతం 20 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలే 4,637 ఉన్నాయి. వాటన్నింటిని మూసివేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నా పాఠశాలలు    460 ఉండగా వాటిని మూసివేసి వాటిల్లో  పనిచేస్తున్న 403 మంది టీచర్లను ఇతర స్కూళ్లకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవేకాదు 20 మందిలోపు విద్యార్థులు ఉన్న మరో 4 వేల స్కూళ్లను మూసివేసి వాటిల్లో పని చేస్తున్న దాదాపు 6 వేల మంది టీచర్లను ఇతర పాఠశాలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మందిలోపు విద్యార్థులు ఉన్న మరిన్ని ఉన్నత పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిసింది.

Advertisement
Advertisement