బేగంపేటలో లాకప్‌డెత్‌! | Sakshi
Sakshi News home page

బేగంపేటలో లాకప్‌డెత్‌!

Published Sat, Apr 8 2017 9:45 AM

బేగంపేటలో లాకప్‌డెత్‌! - Sakshi

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లాఠీ దెబ్బలు తాళలేకే యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ అతని కుటుంబ సభ్యులు, బంధవులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి బాధితులు బేగంపేట పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు.

వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న మోహన్‌ కృష్ణ అలియాస్‌ రాము కారు డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లావణ్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా మోహన్‌ కృష్ణ తీరులో మార్పు వచ్చి.. లావణ్యకు వరుసకు సోదరి అయ్యే ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న లావణ్య కుటుంబసభ్యులు తీరు మార్చుకోవాలని పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో ఆ బాలికను వివాహం చేసుకుంటానని రాము చెప్పడంతో.. ఆగ్రహించిన వారు శుక్రవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నిన్న సాయంత్రం మోహన్‌ క​ష్ణాను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు మదరలితో అసభ్యకరంగా ప్రవర్తిస్తావా అంటూ చితకబాదారు. అనంతరం మోహన్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులే విచక్షణారహితంగా కొట్టి తమ కొడుకును చంపేశారని ఆరోపిస్తున్నారు. రెండు గంటలపాటు టైర్‌ ముక్కతో ఉన్న బ్యాటుతో తన కొడుకున్న కొట్టారని చచ్చాక శవాన్ని అప్పచెప్పారని మృతుని తల్లి రేణుక ఆరోపిస్తోంది. తన చెళ్లెను వివాహం చేసుకుంటానని వేధిస్తుండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశామని.. కానీ పోలీసులు మాత్రం నా భర్త ప్రాణం తీశారని మృతుని భార్య లావణ్య ఆరోపిస్తోంది.

కాగా.. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసించిపోయాడని.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడని.. ఈ ఘటనలో పోలీసుల ప్రమేయం లేదని బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ జగన్‌ అంటున్నారు. పోలీసుల దెబ్బలకే మోహన్ కృష్ణ చనిపోయాడా.. లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలాల్సి ఉంది. పోలీసుల దెబ్బలతోనే మోహన్ కృష్ణ చనిపోయినట్టు తమ విచారణలో తేలితే.. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

Advertisement
Advertisement