నిన్నే ప్రేమిస్తానని..! | Sakshi
Sakshi News home page

నిన్నే ప్రేమిస్తానని..!

Published Sat, Feb 7 2015 11:33 PM

నిన్నే ప్రేమిస్తానని..!

 ప్రేమ క్షణంలో పుడుతుంది. కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడానికి చాలా సమయం పడుతుంది. ఆ ప్రేమను ఎలా చెప్పాలన్న సందిగ్ధం.. అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తారో అన్న సంశయం.. నిరాకరిస్తారేమోనన్న భయం.. నో అంటుందో.. చెంప చెల్లు మనిపిస్తుందోనన ్న అయోమయం.. వెరసి ప్రేమికులు ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం! అందుకే ప్రేమ ప్రపోజల్‌ని లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్‌గా ఫీలవుతుంటారు యూత్.
 
 ఐ లవ్ యూ.. పలకడానికి చిన్న వాక్యమే. మనసు నిండా దాచుకున్న ప్రేమ.. పెదవుల దగ్గరికి వచ్చేసరికి నాలుక మడతలో రోజులకు రోజులు నానుతుంది. తీరా ప్రేమను తెలిపే సమయం వచ్చినప్పుడు ఆ మూడు ముక్కలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. అప్పటి వరకు లబ్‌డబ్ అంటూ కొట్టుకున్న గుండె..దడదడల తాళం వేస్తుంది. గడగడా గ్యాప్ లేకుండా మాట్లాడే నోరు.. తడారి తడబడుతుంది. ధైర్యముంటే..దక్కుతుంది..అంటూ తొలివలపు ప్రోత్సహిస్తున్నా.. తొందరెందుకంటూ మనసు వెనక్కి తోస్తూ ప్రపోజల్‌కు అడ్డు తగులుతుంది. ఒక్కసారి అధిగమించామా.. ఇక మీ ఎద లయ లవ్‌ల వ్‌గా మారిపోతుంది.
 
 ప్రేమపక్షులు..
 ప్రేమ అన్నది ఒకప్పుడు గుండె గడప దాటి బయటకు రావడానికి చాలా సమయమే పట్టేది. అబ్బాయిలు ఎలాగో తంటాలుపడి ప్రేయసి చెవిన వేసినా.. చాలామంది అమ్మాయిలు తమ ప్రేమను మనసుకే పరిమితం చేసుకునేవారు. ఈ రోజుల్లో అమ్మాయిలూ తమ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారు. యువతీ యువకులు పరస్పరం భావాలను వెల్లడించుకుంటున్నారు. ప్రేమపక్షుల్లా మారి విహరిస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కి ప్రేమను పండించుకుంటున్నారు.
 ..:: సమీర నేలపూడి
 
 ఐ ఫీల్ లవ్..
 ప్రేమ యాత్ర మొదలయ్యేది ప్రపోజల్‌తోనే. ఐ లవ్యూ అన్న మాటకు ఐ టూ లవ్యూ అన్న జవాబు దొరికిన క్షణం.. ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందం.. అయితే మన ప్రపోజల్ కచ్చితంగా అవతలి వారిని ఇంప్రెస్ చేయాలంటే ప్రేమ వ్యక్తీకరణ దగ్గర్నుంచి.. వ్యక్తం చేసే ప్రదేశం, అక్కడి వాతావరణం కూడా ముఖ్యమే. అందుకే ‘మన్మథుడు’లో నాగార్జున సోనాలీ బింద్రేతో అంటాడు.. ‘నేనెవరినైనా ప్రేమిస్తే ఐఫిల్ టవర్ మీద ప్రపోజ్ చేస్తాను, ఇంత ఎత్తులో అయితే నో చెప్పలేదు’ అని. అవును మరి. అవతలివారు నో అనలేని అందమైన ప్రదేశాలను ఎంచుకుని, అక్కడ మనసు విప్పితే.. అవతలివారు ఇంప్రెస్ అవక తప్పదు. అలా అని నాగార్జునలా ప్యారిస్ వెళ్లాల్సిన పనిలేదు.
 
 ఎంతో అందమైన, ప్రపోజల్‌కు అనువైన ప్రదేశాలు మన సిటీలో చాలానే ఉన్నాయి. ట్యాంక్ బండ్, ఓరిస్ తాన్‌సేన్, దుర్గం చెరువు, గోల్కొండ, గండిపేట, షామీర్‌పేట్ లేక్, బోలెడన్ని కాఫీ షాపులు, అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి మన భాగ్యనగరంలో. మీ లవర్ టేస్ట్‌ని బట్టి ప్లేస్‌ని ఎంచుకోండి. ప్లజెంట్‌గా ప్రేమని ప్రపోజ్ చేసెయ్యండి. ఆల్ ద బెస్ట్!
 
 ఇవి మర్చిపోకండి!
  మీరు ప్రపోజ్ చేస్తున్న వ్యక్తి మీకు తెలిసినవారే అయితే సమస్య లేదు. కానీ మీరు రహస్యంగా ప్రేమించి, తొలిసారిగా తనని కలసి ప్రపోజ్ చేయబోతుంటే మాత్రం జాగ్రత్త. ఫస్ట్ ఇంప్రెషన్ ముఖ్యం కాబట్టి డ్రెస్సింగ్ బాగుండాలి.
 
 చెప్పాల్సిన విషయం నసుగుతూ కాకుండా సూటిగా చెప్పండి.నేల చూపులు చూసేవాళ్ల మీద మంచి అభిప్రాయం కలగదు. అలాగే అటూ ఇటూ చూస్తూ మాట్లాడటమూ కరెక్ట్ కాదు. మనుషులు దగ్గరవ్వాలంటే ఐ కాంటాక్ట్ చాలా అవసరం. కాబట్టి తన కళ్లలోకి చూసి మాట్లాడండి.
 
 గ్రీటింగ్ కార్డ్, పువ్వులు, రింగ్.. ఏదో ఒకటి ఇచ్చే ఎందుకు ప్రపోజ్ చేస్తారో తెలుసా? ఒకవేళ అప్పటికి తాను జవాబు ఇవ్వలేకపోయినా, తర్వాత దాన్ని చూసినప్పుడల్లా మీ ప్రపోజల్ తనకి గుర్తొస్తుంది. కాబట్టి తప్పకుండా గిఫ్ట్ ఇవ్వండి. అయితే అది రిచ్‌గా ఉండటం కంటే, తనని ఆకట్టుకునేలా ఉండటం ముఖ్యం.
 
 నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే, నేను నిన్ను బలవంత పెట్టడం లేదు అన్న భావాన్ని తప్పక వ్యక్తపర్చండి. దాన్నిబట్టి మీరు తన అభిప్రాయానికి విలువ ఇచ్చే మనిషని తనకు అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యం.. తను పొరపాటున నో అంటే నవ్వుతూ స్వీకరించండి. వీలైతే మరోసారి ఆలోచించమని చెప్పి వెళ్లిపోండి. అంతేకానీ తనను బలవంతపెట్టి, ఇబ్బందిపెట్టి మీ ప్రేమను అగౌరవపరచుకోకండి.
 

Advertisement
Advertisement