మహానాడు తీర్మానాలపై టీటీడీపీ కార్యాచరణ | Sakshi
Sakshi News home page

మహానాడు తీర్మానాలపై టీటీడీపీ కార్యాచరణ

Published Thu, Jun 9 2016 3:49 AM

మహానాడు తీర్మానాలపై టీటీడీపీ కార్యాచరణ - Sakshi

13వ తేదీన ఎన్టీఆర్ భవన్‌లో వర్క్‌షాప్: రావుల

సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో చేసిన తీర్మానాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ సమావేశం జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రావుల సమావేశ వివరాల్ని మీడియాకు తెలిపారు. జిల్లాల మహానాడుల్లో చేసిన తీర్మానాలు, తిరుపతిలో జరిగిన మహానాడులో తెలంగాణపై చేసిన తీర్మానాలపై ఈ వర్క్‌షాప్‌లో చర్చిస్తామని ఆయన చెప్పారు.

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యుత్‌పై వాస్తవాలు చెప్పిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘును అగౌరవ పరుస్తున్నారని తెలిపారు. 12 మంది మంత్రులు ఒకే అంశంపై మాట్లాడిన సందర్భం గతంలో ఎన్నడూ లేదని, చివరకు వారి శాఖల గురించి మాట్లాడని మంత్రులు కూడా స్పందించారంటే కోదండరాం అంశంపై టీఆర్‌ఎస్ భయపడుతోందని అర్థమవుతోందన్నారు. వర్క్‌షాప్‌లో నీటిపారుదల, ప్రభుత్వ హామీలు, ముస్లింలకు 12% రిజర్వేషన్, జీఓ 123 తదితర అంశాలపై కూడా చర్చిస్తామని రావుల తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement