ఇప్పసారా... తెలంగాణ టకీలా! | Sakshi
Sakshi News home page

ఇప్పసారా... తెలంగాణ టకీలా!

Published Thu, Aug 13 2015 5:42 AM

ఇప్పసారా తయారీ ఇలా - Sakshi

- సహజ సిద్ధ మత్తు పానీయంపై దృష్టి సారించిన సర్కారు
- మెక్సికో బ్రాండ్ ‘టకీలా’ తరహాలో ఇప్పసారాకు ఇమేజ్ పెంచే ఆలోచన
- గోదావరి పరివాహక అడవుల్లో వందలాది ఎకరాల్లో విరివిగా ఇప్ప చెట్లు
- కృత్రిమంగా చెట్ల పెంపకం, పూల సేకరణ, తయారీ విధానంపై అధ్యయనం
 
సాక్షి, హైదరాబాద్:
ప్రకృతి సహజ సిద్ధమైన ఇప్పపూలతో తయారుచేసే సారాను రాష్ట్రంలో ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మెక్సికో దేశానికి చెందిన ‘టకీలా’ పానీయం తరహాలో ‘ఇప్పసారా’కు కూడా బ్రాండ్ ఇమేజ్ తేవాలని యోచిస్తోంది. గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని అడవుల్లో వందలాది ఎకరాల్లో ఇప్పచెట్లు విరివిగా పెరుగుతాయి. ఇక్కడి గిరిజనులు వాటి పూలతో సారా తయారుచేసి.. వారు తాగడంతో పాటు విక్రయిస్తుంటారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని వినియోగం ఎక్కువ. అయితే సారాపై ప్రభుత్వ నిషేధం, అటవీశాఖ ఆంక్షల నేపథ్యంలో... ఇప్పసారా తయారుచేసే గిరిజన కుటుంబాలు తగ్గిపోయాయి. కానీ తాజాగా ఇప్పపూలను సేకరించి శుద్ధిచేసి, శాస్త్రీయంగా సారా తయారు చేసి విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సర్కారు మదిలో మెదిలింది.

ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం... రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇప్పచెట్లు ఉన్నాయి, ఇప్పసారాను శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసేందుకు గల అవకాశాలు, కృత్రిమంగా ఇప్పచెట్లను పెంచడం ద్వారా ఎన్ని రోజుల్లో పూలను సేకరించవచ్చనే విషయాలపై అధ్యయనం చేయాలని సూచించింది. ఉత్తర తెలంగాణ, ఖమ్మం అడవులతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పపూల సేకరణ చేయవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో దేశీయ పానీయాల విక్రయాలపై కూడా సర్వే జరపాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది.

‘మహువా’గా ప్రసిద్ధి
ఇప్పచెట్టుగా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ చెట్ల శాస్త్రీయ నామం ‘మధుకా లింగిఫోలియా’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మహువా, మొహా, మధుకా, ఇల్లుప్పాయి, మదుర్గం వంటి పేర్లతో పిలుస్తారు. ఇప్ప కాయల నుంచి తీసిన నూనెను వైద్యానికి వినియోగిస్తారు. జామ్‌లు, ఇతర క్రీమ్‌ల తయారీలోనూ ఇప్ప కాయలను వినియోగిస్తారు. అయితే అడవుల్లోని గిరిజనులు ఈ చెట్టు పూలను సేకరించి సారా తయారుచేస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాచలం, ఏటూరు నాగారం డివిజన్లలోని గిరిజన తండాల్లో ఇప్పసారా వినియోగిస్తున్నారు. దీనిని తెలంగాణ బ్రాండ్ పానీయంగా మారిస్తే... ఇప్పపూల సేకరణ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.

టకీలాతో సారూప్యం
మెక్సికోలోని టకీలా నగరంలో నాలుగు శతాబ్దాల క్రితమే సహజ సిద్ధమైన మత్తు పానీయాన్ని గుర్తించారు. ‘బ్లూ అగేవ్’ అనే మొక్క నుంచి తయారుచేసే ఈ మత్తు పానీయానికి బాగా డిమాండ్ పెరగడంతో దానిని ఆ నగరం పేరు మీదే ‘టకీలా’గా ఖాయం చేశారు. ఇప్పుడిది మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభిస్తోంది. అదే తరహాలో ఇప్పసారాకు బ్రాండ్ ఇమేజ్ తేవాలనేది సర్కారు యోచన. మరో విశేషం ఏమిటంటే.. టకీలా, ఇప్పసారా రెండూ కూడా ఎలాంటి రంగు లేకుండా నీటిలా కనిపిస్తాయి.
 
ఓ రిసార్టులో పరిశీలన
హైదరాబాద్ శివార్లలోని ఒక రిసార్ట్ యాజమాన్యం ఇప్పచెట్లను ప్రయోగాత్మకంగా పెంచుతోంది. వేగంగా పెరిగే ఈ చెట్టు 20 మీటర్ల ఎత్తు ఎదుగుతుంది. కృత్రిమంగా చెట్లను పెంచాల్సి వస్తే ఏం చేయాలన్న అంశంపై ఎక్సైజ్‌శాఖ అధికారులు సదరు రిసార్ట్స్‌కు వెళ్లి ప్రాథమికంగా పరిశీలించినట్లు ఓ అధికారి తెలిపారు. అడవుల్లో పెరిగిన చెట్లతో పాటు కృత్రిమంగా చెట్లను పెంచడం వల్ల అయ్యే ఖర్చు, నిర్వహణ భారం, మార్కెట్ అవకాశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement