మజ్లిస్ దాడులపై ఇంత నిర్లక్ష్యమా? | Sakshi
Sakshi News home page

మజ్లిస్ దాడులపై ఇంత నిర్లక్ష్యమా?

Published Thu, Feb 4 2016 3:18 AM

Majlis on the attacks, so carefree?

♦ టీపీసీసీ ముఖ్యుల్లో అసంతృప్తి
♦ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దీటుగా స్పందించలేదని వ్యాఖ్యలు
♦ ఇలాగైతే పార్టీ శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన..  దాడి  చేసిన చోటు నుంచే పోరాటం సాగించాలని నేతల సూచనలు
 
 సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై మజ్లిస్ దాడికి దిగినా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గట్టిగా స్పందించలేదంటూ ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అగ్రనాయకత్వంపైనే దాడి జరిగినా దీటుగా ప్రతి స్పందించకపోవడం ద్వారా పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని పలువురు ముఖ్య నేతలు ప్రశ్నిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఖాన్‌ను పోలీసు స్టేషన్ నుంచి విడిపించడానికి స్వయంగా ఉత్తమ్, షబ్బీర్ వెళ్లడం ద్వారా పార్టీ శ్రేణులకు విశ్వాసం కల్పించారని, అయితే ఆ సందర్భంగా జరిగిన దాడికి ధీటుగా ప్రతి స్పందించడంలోనే పార్టీ యంత్రాంగం విఫలమైందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘ఉత్తమ్, షబ్బీర్‌పై దాడులు చిన్న విషయం కాదు. దీన్ని రాష్ట్ర పార్టీపై మజ్లిస్‌తో కలిసి ప్రభుత్వం చేసిన దాడిగా చూడాలి. ఎన్నికల సందర్భంగా ఇలాంటివి జరిగినా చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. టీపీసీసీ చీఫ్, ప్రతిపక్ష నేతపై దాడి తెగబడినా సహనం పాటిస్తే పార్టీ శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతినదా? ‘అగ్రనేతలపై దాడినే పట్టించుకోకుంటే మాకు దిక్కెవర’ని పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతారు. దీనిపై ఇప్పటికైనా క్షేత్రస్థాయి కార్యాచరణకు దిగితే మంచిది’’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు సూచించారు.

పాతబస్తీకి టీపీసీసీ అధినేత వెళ్తే.. ‘మేరా ఇలాఖా మే కైసా ఆయేగా’ అంటూ అసదుద్దీన్ దాడికి దిగడం కంటే బరితెగింపు ప్రజాస్వామ్యంలో ఇంకేముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసదుద్దీన్ దాడికి దిగిన ప్రాంతాన్నే కేంద్రబిందువు చేసుకొని కాంగ్రెస్ పోరాటం సాగించాలని మరికొందరు నేతలు సూచించారు. దాడి వెంటనే బంద్‌లు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి క్షేత్రస్థాయి కార్యాచరణకు ఎందుకు పిలుపు ఇవ్వలేదని పలువురు టీపీసీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement