కలత తీర్చి... కల నెరవేర్చి! | Sakshi
Sakshi News home page

కలత తీర్చి... కల నెరవేర్చి!

Published Wed, Apr 29 2015 11:40 PM

కలత తీర్చి... కల నెరవేర్చి!

ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులు  
17 మంది కలలు నెరవేర్చిన ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’

 
అందరిలాగానే వారికీ కొన్ని ఆశలున్నాయి...ఆశయాలు ఉన్నాయి. అవి తీరే దారి మాత్రం కనిపించలేదు. ఆ దారిని మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చూపించింది. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న 17 మంది చిన్నారులు కోరిన కానుకలు అందించి... సహృదయతను చాటుకుంది. ఈ క్రతువులో పోలీసులూ పాలు పంచుకున్నారు. ఆ చిన్ని కళ్లల్లో ఆనందాన్ని నింపారు.
 
సిటీబ్యూరో:  ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న కొంతమంది చిన్నారుల కలలు నెరవేర్చేందుకు ఓ సంస్థ ముందుకు వస్తే...దానికి తమవంతు సాయం అందించిన పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యం చూసిన బాధితుల తల్లిదండ్రులు తమ బిడ్డల పరిస్థితి తలచుకొని తల్లడిల్లుతూనే... ఆ సంస్థ... పోలీసుల దయార్ధ్ర హృదయానికి ఉప్పొంగిపోయారు. వివరాల్లోకి వెళితే... ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతూ నగరంలోని వివిధ ఆస్పత్రులలో 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరంతా ఎన్నో రోజులుగా కావాలనుకుంటున్న వస్తువులు...బొమ్మలను అందించేందుకు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ‘వరల్డ్ విష్ డే’ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చిన్నారులు కోరిన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులను ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

మనో ధైర్యం కల్పిస్తే... వారు తొందరగా కోలుకుంటారని చెప్పారు. ఇలా ధైర్యం కల్పించేందుకు యత్నిస్తున్న మేక్ ఎ విష్ ఫౌండేషన్ కృషిని అభినందించారు. డాక్టర్లు ఇంద్రసేనారెడ్డి, సదాశివుడు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులను తగ్గించే దిశగా వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. క్యాన్సర్‌ను సైతం జయించే రోజులు వచ్చాయని తెలిపారు. మందుల వినియోగంతో పాటు బాధితులకు ఆత్మస్థైర్యం కల్పిస్తే వ్యాధి నుంచి త్వరగా బయటపడతారని చెప్పారు. ఈమేరకు అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి కలసి చిన్నారులు అవదూత్ భవాని (15), చెన్నకేశవ(17), పి.మహేష్ (17),శుభం (15), సుమేరాఫాతిమా (16), మహ్మద్ అబ్దుల్ ఖాదర్ (16), అన్కూరి పరశురాములు (16), అంకూష్ లహరి(15)లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు.  కె.శ్రీను (15), మహ్మద్ మునావర్‌అలీ (12), మాస్టర్ సాత్విక్ (16), జి.కుమార్ (15)లకు ప్లే స్టేషన్ (బొమ్మలాట)లు, జి.సంహిత్ (16), ప్రశాంత్ (13)లకు ల్యాప్‌టాప్‌లు, సంజయ్‌మోర్ (14)కు మ్యూజిక్ కీబోర్డు, పావని (17)కి ఐపాడ్, అరుణ్‌కుమార్ (7)కు  ఎలక్ట్రానిక్ బైక్‌లను అందించారు.

తమ పిల్లల్లో ఆనందాన్ని నింపేందుకు ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషిని చూసిన ఆ తల్లిదండ్రులు చెమర్చిన కళ్లతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగ ల్, ఉప్పల్, అనంతపూర్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఈ చిన్నారులు నగరంలోని డయాబైడ్, ఎంఎన్‌జే, తలసీమియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ైవె ద్యులుగా... ఇంజినీర్లుగా ఎదగాలనేది తమ ఆశయమని ఆ చిన్నారులు చెప్పినపుడు అక్కడి వారి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. తమను ఆదుకునేందుకు ఇంతమంది ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని వారంతా కృతజ్ఞతలు చెప్పారు.
 
 

Advertisement
Advertisement