కేసులు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్ | Sakshi
Sakshi News home page

కేసులు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్

Published Fri, Sep 30 2016 3:28 AM

కేసులు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్ - Sakshi

* ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ నుంచి హైకోర్టుకు మార్పు
* హైకోర్టు హెచ్చరించడంతో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ జారీ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ జారీ చేయకపోతే.. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించడంతో రాత్రికి రాత్రే ఈ నిర్ణయం తీసుకుంది.

ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి వివరణ ఇస్తూ.. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణ కేసులను హైకోర్టుకు బదిలీ చేసేందుకు ఆర్డినెన్స్ తెస్తామని విన్నవించారు. దీంతో ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. కాగా శాసనసభ సమావేశాలను దసరా తర్వాత నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ గురువారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేశారు.

Advertisement
Advertisement