మమ అనిపిస్తున్నారు.. | Sakshi
Sakshi News home page

మమ అనిపిస్తున్నారు..

Published Sun, Nov 17 2013 4:58 AM

Mama appear ..

 =తూతూమంత్రంగా ‘రచ్చబండ’ సభలు
 =లబ్ధిదారుల చేతికందని పింఛన్లు, రేషన్ కూపన్లు
 =స్థానిక సమస్యలపై వినతుల వెల్లువ
 =ప్రచారం తప్ప ఒరిగిందేమీ లేదంటున్న విపక్ష నేతలు

 
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి మినహా రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ లేదని పలువురు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. శనివారం నగరంలోని నాలుగుప్రాంతాల్లో మూడోవిడత రచ్చబండ కార్యక్రమాలు తూతూమంత్రంగా జరిగాయి. గత కార్యక్రమాల్లో స్వీకరించిన దరఖాస్తులకు లబ్ధిదారులకు తాజా రచ్చబండలో పెన్షన్లు, రేషన్ కార్డులిస్తామని చెప్పిన అధికారులు కొద్దిమందికి మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.

దీంతో ఎంతో ఆశగా వచ్చిన పలువురు లబ్ధిదారులు ఒట్టి చేతులతో నిరాశగా వెనుదిరిగారు. చంచల్‌గూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ కార్పొరేటర్లు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి,అస్లాంలు అడ్డుకున్నారు. గత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమందికి అర్హులకు లబ్ధిచేకూరిందో వివరాలు తెలపాలని అధికారులను,ఎమ్మెల్యేను నిలదీయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

సోమాజిగూడలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు స్థానికులు మాట్లాడుతూ..గతంలో జరిగిన రచ్చబండలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి దానం నాగేందర్ డుమ్మా కొట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్‌మారేడుపల్లి నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్‌లో జరిగిన కార్యక్రమాన్ని కేవలం అరగంటలో ముగించి ఎమ్మెల్యే శంకర్రావు వెళ్లిపోయారు.  
 
 నేతలు ఏమన్నారంటే..
 కాచిగూడలోని ఏకేభవన్‌లో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాన వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
     
 జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ సంక్రమంగా జరగడం లేదని..దీంతో వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. పెన్షన్ అక్రమాలపై అధికారులు స్పందించి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
     
 సలీంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రచ్చబండ వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేకానీ ప్రజలకు ఒరిగిందే మీ లేదన్నారు.
     
 రచ్చబండ..ముఖ్యమంత్రి ప్రచారానికే పరిమితమైందని జీహెచ్‌ఎంసీ టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలకు ఇళ్లను కేటాయించపోవడం సరికాదన్నారు. గత రచ్చబండలో తీసుకున్న దరఖాస్తులను అధికారులు బుట్టదాఖలు చేశారన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement