పోలీసు వలయంలో మాన్గార్ బస్తీ | Sakshi
Sakshi News home page

పోలీసు వలయంలో మాన్గార్ బస్తీ

Published Wed, Sep 24 2014 1:12 AM

పోలీసు వలయంలో మాన్గార్ బస్తీ - Sakshi

నాంపల్లి:  మంగళవారం తెల్లవారు జామున 2 గంటలకు పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులు హబీబ్‌నగర్ ఠాణా పరిధిలోని మాన్గార్ బస్తీ, సమీపంలోని అఫ్జల్‌సాగర్, జవహర్‌నగర్‌లను చుట్టుముట్టారు.  36 బృందాలుగా ఏర్పడి కార్డన్ అండ్ సర్‌‌చ నిర్వహించారు. అన్ని ఇళ్లకు వెళ్లి నిద్రలో ఉన్న వారిని లేపి సోదాలు జరిపారు.
 
ఉదయం 5 గంటల వరకు తనిఖీలు చేశారు.  56 మంది అనుమానిత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.40 తులాల బంగారం, కిలో వెండి, రూ.75 వేల నగదు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దాడులకు నిరసనగా ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో ముగ్గురు రెండు హత్య కేసుల్లో నిందితులని, మిగతా వారు వంద కేసుల్లో నేరస్తులని తెలిసింది.
 
ఏసీపీ కార్యాలయం కిటకిట...
మాన్గార్ బస్తీ, అఫ్జల్‌సారగ్ బస్తీల్లోని కొందరిని నేరస్తులుగా అనుమానితులను పోలీసులు గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీపీ కార్యాలయం కిటకిటలాడింది. హబీబ్‌నగర్ పోలీసులు వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆధార్, రేషన్ కార్డులను తీసుకున్నారు.
 
బయటి రాష్ట్రాల్లో బంగారం తాకట్టు...
మాన్గార్ బస్తీలో ఉంటున్న నేరస్తులందరూ హైదరాబాద్‌తో పాటు నాందేడ్, గుల్బర్గా పట్టణాల్లో తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకున్నట్లు పోలీసులకు రసీదులు లభించాయి. పరారీలో ఉన్న రిసీవర్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
 
భారీగా మద్యం బాటిళ్లు లభ్యం...
మాన్గార్ బస్తీలో ఉండే నేరస్తుల ఇళ్లల్లో భారీగా మద్యం బాటిళ్లు దొరికాయి. వీరందరూ వైన్ షాపులు బంద్ ఉన్న సమయాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ ఇక్కడ మద్యాన్ని అమ్ముతుం టారు. అంతేకుండా గుడుంబా, గంజాయి కూడా విక్రయిస్తుం టారు.  ఈ మద్యం బాటిళ్ల వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు సమాచారం. అతడిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది.
 
వీడిన హత్యాయత్నం కేసు మిస్టరీ: ముగ్గురు బాలనేరస్తుల అరెస్టు
కార్డన్ అండ్ సర్చ్‌లో ఓ హత్య కేసు మిస్టరీ వీడింది. 16-17 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు పాతబాలనేరస్తులను పోలీసులు విచారించగా హత్య విషయాన్ని బయటపెట్టారు.  జల్సాలకు అలవాటుపడ్డ ఈ ముగ్గురూ ఫుట్‌పాత్‌పై నిద్రించేవారిని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసిన వ్యక్తి ముక్కు వద్ద వైట్నర్ ఉంచి అతడు మరింత మత్తులోకి వెళ్లేలా చేస్తారు. తర్వాత దాడి చేసి, డబ్బు దోచుకుంటారు.
 
ఇదే క్రమంలో ఈనెల 11న గోకుల్‌నగర్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 45 ఏళ్ల వ్యక్తిపై వైట్నర్ ప్రయోగించారు. అతను అంతలోనే మేల్కోవడంతో తలపై బండరాయితో మోదారు. ఇది గమనించిన ఓ వ్యక్తి హబీబ్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి అపస్మారకస్థితిలో ఉన్న బాధితుడిని ఉస్మానియాకు తరలించగా.. చికిత్సపొందుతూ ఈనెల 15న మృతి చెందాడు. కాగా, మంగళవారం కార్డన్ అండ్ సర్చ్‌లో పోలీసులు సదరు ముగ్గురు బాలనేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈనెల 11న తాము ఓ వ్యక్తిని హత్య చేశామని వెల్లడించారు. దీంతో ముగ్గురినీ జువైనల్ హోంకు తరలించారు.

Advertisement
Advertisement