నీకు నేను.. నాకు నువ్వు! | Sakshi
Sakshi News home page

నీకు నేను.. నాకు నువ్వు!

Published Sun, Aug 14 2016 2:11 AM

నీకు నేను.. నాకు నువ్వు! - Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన ఓ ‘ముఖ్య నేత’ తమ్ముడి కోసం 400 ఎకరాల వివాదాన్ని నయీమ్ సెటిల్ చేశాడు. అందుకు బదులుగా ‘ముఖ్య నేత’ ఇతడికి అనేక విధాలుగా సాయం అందించాడు.
 
నయీమ్‌తో పెనవేసుకున్న పోలీసు బంధం
* ఎస్సై స్థాయి నుంచి డీఎస్పీల దాకా డీలింగ్స్
* విలువైన స్థలాలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన గ్యాంగ్‌స్టర్
* డైరీలు, పత్రాలు, పుస్తకాల పరిశీలనలో విస్మయకర అంశాలు


సాక్షి, హైదరాబాద్: నయీమ్ కోసం పోలీసులు.. పోలీసుల కోసం నయీమ్.. ఇలా ఒకరి కోసం ఒకరు పనిచేశారు! రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సైతం ఈ కరుడుగట్టిన నేరగాడితో అంటకాగారు. ఏపీలోని సీఆర్‌డీఏ పరిధిలోనూ నయీమ్ దందాలు జరిపాడని తెలిసింది. ఇతడి నుంచి అనేక విధాలుగా లబ్ధి పొందిన వారిలో ఎస్సై నుంచి అధికారి వరకు వివిధ హోదాలకు చెందిన వారు ఉన్నారు. నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌తోపాటు నయీమ్‌కు చెందిన స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, డైరీలు, పుస్తకాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

ఇందులో విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లావాదేవీలన్నీ బినామీ పేర్లతోనే జరగడంతో వాటికి సంబంధించిన ఆధారాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. అవి లభించిన తర్వాత సదరు పోలీసులు, నేతలు, వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన నయీమ్ దందాలివీ...
 
కొన్నేళ్ల క్రితం ఎన్నికల ప్రచారం కోసం ప్రయాణిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సినీ నటికి నగర శివార్లలో ఆరెకరాల భూమి ఉండేది. దీనిని నయీమ్ ఆక్రమించాడు. దీనికి సహకరించిన ఓ ఎస్సైకి (ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్) మణికొండ పంచవటి కాలనీలో ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు
మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఓ ఫంక్షన్ హాల్‌ను నయీమ్ తన అడ్డాగా మార్చుకున్నాడు. దీని యజమానికి చెందిన 15 ఎకరాలు భూ వివాదాన్ని సెటిల్ చేశాడు. ప్రతిఫలంగా అత్యంత ఖరీదైన కారును తీసుకున్నాడు
వికారాబాద్‌లో ఫామ్‌హౌస్, కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ సొసైటీలో 60 ప్లాట్లు, అత్తాపూర్‌లో ఐదు ఖరీదైన ప్లాట్లు, ఆరె మైసమ్మ వద్ద ఓ వెంచర్ నయీమ్ కబ్జాలో ఉన్నట్లు తేలింది
సిటీ, సైబరాబాద్‌ల్లో ఎస్సై నుంచి వివిధ హోదాల్లో పని చేసిన ఓ అధికారి నయీమ్‌కు అనేక విధాలుగా సహకరించారు. దీంతో ఆయనకు అమీర్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, శివరామ్‌పల్లిలో 10 ఎకరాల స్థలం, దానిలో 100 గజాల గెస్ట్‌హౌస్ ముట్టజెప్పాడు
మెదక్ జిల్లాలో రెండెకరాల స్థలానికి సంబంధించి మాట వినని ఓ న్యాయవాదిని హత్య చేయాలని నయీమ్ నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన ప్లాన్‌ను ఆ జిల్లాకు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ వేసినట్లు తెలిసింది
నగర శివార్లలో నార్త్‌జోన్‌లో ఏసీపీగా పని చేసిన ఓ అధికారికి నయీమ్ రూ.70 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సౌత్‌జోన్‌లో పని చేసిన ఓ అధికారికి మలక్‌పేటలో రెండు ఫ్లాట్లు ముట్టజెప్పాడు
శివార్లలో నయీమ్‌తోపాటు కొందరు పోలీసు అధికారులూ ఉమ్మడిగా బినామీ పేర్లతో 50 ఎకరాల మామిడి తోటను కబ్జాలో పెట్టుకున్నారు
పలు విభాగాల్లో పని చేసిన/చేస్తున్న నలుగురు డీఎస్పీలను తనకు అనుకూలంగా వాడుకున్న నయీమ్ వారికి మక్తల్‌లో 200 ఎకరాలు ఇచ్చాడు
ఓ ఉన్నతాధికారి కుమార్తె బర్త్‌డే వేడుకలకు వెళ్లిన నయీమ్ జూబ్లీహిల్స్‌లో వెయ్యి గజాల స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు
సంగారెడ్డిలో 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఓ సీఏను నయీమ్ హత్య చేశాడు. ఈ కేసులో తనకు సహకరించిన పోలీసు అధికారికి రూ.2.5 కోట్లు ఇచ్చాడు
ఓ అత్యున్నత అధికారికి శివారు జిల్లాల్లో 150 ఎకరాల వరకు కట్టబెట్టిన నయీమ్.. అనేక సందర్భాల్లో ఆయన పరపతిని వినియోగించుకున్నాడు
నల్లగొండ జిల్లాలో పని చేసి, ప్రస్తుతం నగరంలోనే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారికి రూ.35 లక్షల విలువైన 2 లగ్జరీ కార్లను నయీమ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు
డీఐజీ స్థాయిలో పని చేసిన ఓ అధికారికి ఫిల్మ్‌సిటీ సమీపంలో 12 ఎకరాలు ఇచ్చాడు. దీనికి సమీపంలోనే నయీమ్ కబ్జాలో మరో 15 ఎకరాలు ఉంది
ఓ ఉన్నతాధికారితో పాటు నలుగురు అధికారులకు కలిపి బినామీ పేర్లతో శివార్లలో 380 ఎకరాలు కట్టబెట్టాడు
నయీమ్‌కు అనేక విధాలుగా సహకారం అందించిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు టెలికాం నగర్‌లో ఇళ్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు
మల్కాజ్‌గిరి భూ వివాదానికి సంబంధించి నయీమ్ ఓ హత్య చేశాడు. దీన్ని మాఫీ చేసిన అధికారికి రంగారెడ్డి జిల్లాలో ఫామ్‌హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు
నగరానికి చెందిన ఓ భూ వివాదాన్ని ఓ మీడియా ఛానల్‌కు చెందిన కీలక వ్యక్తి.. నయీమ్ వద్దకు తీసుకువెళ్లాడు. దీన్ని సెటిల్ చేయించినందుకు సదరు మీడియా వ్యక్తి భూ యజమాని నుంచి రూ.10 కోట్లు తీసుకున్నాడని తెలిసింది
ఏపీలో రాజధాని ప్రకటన తర్వాత సీఆర్‌డీఏలోని ప్రాంతంలోకి నయీమ్ అడుగుపెట్టాడు. గుంటూరులోని భూ దందాకు సహకరించినందుకు ఓ ఉన్నతాధికారికి రూ.5 కోట్లు సమర్పించినట్లు తెలిసింది
ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు పోలీసు అధికారులతో కలిసి దుబాయ్‌లో సూట్‌కేస్ కంపెనీలు స్థాపించాడని సమాచారం. ‘ఎన్-కంపెనీ’ ఏర్పాటు తర్వాత వీటి ఆధారంగా నగదును ఇక్కడకు తరలించాలని పథకం వేశాడు
 
నయీమ్ నక్సలైట్ నుంచి ‘జనజీవన స్రవంతి’లో కలిసిన తర్వాత మావోయిస్టులకు సంబంధించిన సమాచారం అధికారులకు అందించాడు. ఈ నేపథ్యంలోనే కొందరు అధికారులతో కలిసి ఓ డంప్‌పై దాడి చేశాడు. అక్కడ దొరికిన రూ.1.5 కోట్ల నగదును అంతా పంచుకుని ఆయుధాలు, తూటాలు తదితరాలను మాత్రమే రికవరీ చూపించారు.
 
సుదీర్ఘకాలంగా నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉండి, అనేక అంశాల్లో సాయం అందించిన నగరానికి చెందిన అధికారికి మద్యం వ్యాపారం అప్పగించాడు. నయీమ్ బినామీల పేర్లతో ఉన్న 16 వైన్ షాపులు, 4 బార్లను ఈయనే పర్యవేక్షిస్తున్నారు.
 
సరూర్‌నగర్ ప్రాంతంలో ఉన్న విలువైన స్థలానికి సంబంధించి ఇద్దరు బడా బిల్డర్ల మధ్య వివాదాన్ని సెటిల్ చేసే బాధ్యతల్ని ఆ ప్రాంతంలో పని చేసిన ఓ డీఎస్పీ స్థాయి అధికారికి నయీమ్ అప్పగించాడు. తర్వాత అతడికి ఎల్బీనగర్ ప్రాంతంలో 2,500 గజాల స్థలాన్ని కబ్జా చేసి, షాపింగ్ కాంప్లెక్స్‌గా మార్చి గిఫ్ట్‌గా ఇచ్చాడు.

Advertisement
Advertisement