Sakshi News home page

ఇక కళ్యాణ‘మస్తు’..

Published Fri, Aug 5 2016 1:27 AM

ఇక కళ్యాణ‘మస్తు’..

మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు
శ్రావణమాసం రాకతో వేల సంఖ్యలో వివాహాలు
 
 సాక్షి, హైదరాబాద్:

 ‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
 కంఠే బద్నాని శుభగే త్వంజీవ శరదం శతం’

 
ఈ మంత్రం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే సమయం ఆసన్నమైంది. పచ్చని పందిళ్లు... మామిడి తోరణాలు... మేళతాళాలు... మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులను ఏకం చేసే వివాహ మహోత్సవాలు సమీపించాయి. మూడు నెలల విరామం తర్వాత శ్రావణ శుభ గడియలు ప్రవేశించడంతో  వేలాది వివాహాలు జరుగనున్నాయి. చైత్రమాసం (ఏప్రిల్ 27వ) తేదీతో ముహూర్తాలు అయిపోయాయి. వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వరుసగా గురు, శుక్ర మూఢాలు రావడం ఆషాడం శూన్యమాసం కావడంతో మూడు నెలలుగా శుభ ముహూర్తాలు లేవు. ఆరో తేదీన పంచమి - మిథున లగ్నంతో శుభముహూర్తాలు ఆరంభమవుతున్నాయి. ఈ నెల 10, 13, 17, 18, 19, 20, 26 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. తదుపరి ఆశ్వయుజ మాసంలో పూర్తిగా ముహూర్తాలు లేవు. అందువల్ల శ్రావణమాసంలో కాకపోతే పెళ్లి ముహూర్తాల కోసం మళ్లీ మార్గశిర, కార్తీక మాసాల కోసం ఎదురుచూడాల్సిందే. ఇప్పటికే సంబంధాలు కుదిరిన వారికి ఈ నెలలో పెళ్లిళ్లు చేసేందుకు కళ్యాణ మంటపాల అడ్వాన్సు బుకింగ్‌లు జోరందుకున్నాయి. కల్యాణ వేదికల అలంకరణ, బ్యాండ్ మేళాలు, మంగళవాయిద్య బృందాలకు గిరాకీ పెరిగింది.

కళ్యాణ మంటపాలు బిజీబిజీ..
పెళ్లిళ్లు ఉండటంతో కళ్యాణ మంటపాల అద్దెల రేట్లూ అదిరిపోతున్నాయి. ‘ఈనెల 18న శ్రావణ పౌర్ణమి, ధనిష్ట నక్షత్రం, కన్యాలగ్నం. గురువారం ఉదయం 8.51 గంటలకు కన్యాలగ్న ముహూర్తం చాలా బలమైనది. అందుకే ఎక్కువమంది ఆరోజుకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. తిరుమలలో ఆరోజు పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి...’ అని ఒక వేదపండితుడు ‘సాక్షి’కి తెలిపారు.
 
వామ్మో అనిపించే అలంకరణలు..
సంపన్నులే కాకుండా మధ్య తరగతి వారు కూడా పెళ్ళి మండపాల అలంకరణకు ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఇందుకోసం బెంగళూరు నుంచి పూలను తెప్పించుకుంటున్నార ని తిరుపతికి చెందిన మంటపాల అలంకరణ కాంట్రాక్టరు నారాయణ తెలిపారు. మంటపం అలంకరణ ఖర్చు అనేది వారు కోరుకున్న తీరు, మంటపం సైజును బట్టి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకూ, ఆపైన కూడా  ఉంటుందని వివరించారు.

Advertisement
Advertisement