మయూర మీనాక్షి | Sakshi
Sakshi News home page

మయూర మీనాక్షి

Published Wed, Jan 21 2015 11:25 PM

మయూర మీనాక్షి

మీనాక్షి శ్రీనివాస్! మోడర్న్ ఇండియన్ ఉమెన్‌కి ప్రతీక. ఆర్కిటెక్ట్‌గా పురాతన కట్టడాలకు ప్రాణం పోస్తూనే.. కాలికి అందెలు కట్టుకుని భరతనాట్యంలో ప్రావీణ్యం చూపుతున్నారు. దానికి సృజనాత్మకతను, ప్రయోగశీలతను జోడించి, శాస్త్రీయ నృత్యాన్ని నవతరానికి చేరువ చేస్తున్నారు. హేమ అరంగమ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన ఆమె... సిటీప్లస్‌తో ముచ్చటించారు.
 ..:: కోన సుధాకర్ రెడ్డి
 
మాది చెన్నై. అమ్మ స్ఫూర్తితోనే నాట్యం నేర్చుకున్నా. పద్మవిభూషణ్ అలర్మేల్ వల్లీ దగ్గర శిక్షణ పొందాను. ఆమెను ఎప్పటికీ మరువలేను. ట్రెడిషినల్ ఆర్ట్ ఫామ్ ద్వారా సమాజానికి చాలా చేయవచ్చు. నా శ్వాస ఉన్నంత వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తూనే ఉంటాను.
 
జీవన నృత్యం..
భరతనాట్యం ఒక సంప్రదాయ నృత్యం. ప్రేక్షకులను సమ్మోహితులను చేయడమే దాని లక్ష్యం. ఒత్తిడి దూరం చేసే దివ్య ఔషధం. ఆర్ట్‌తోనే ధ్యానం చేయవచ్చు. తాళానికి అనుగుణంగా కదిలించే పాదాలు, భావాన్ని కురిపించే నేత్రాల ద్వారా నృత్యం చూసే ప్రేక్షకుల ఆత్మను మన అధీనంలోకి తెచ్చుకుని వారిలోని నెగటివ్ శక్తిని తొలగించి, పాజిటివ్ శక్తిని నింపవచ్చు. ఆ శక్తి నాట్యానికి ఉంది.  

ఇది బాగా సాధన చేస్తున్న వారికే సాధ్యం. ఈ ఎలిమెంట్ పట్టుకున్న ఎవరైనా పెద్ద నృత్యకారులు అవుతారు. నాట్యంపై నిబద్ధతతో పాటు కుటుంబసభ్యుల మద్దతు ఉండటం వల్లే.. నా వృత్తిని, ప్రవృత్తిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. చదువు విజ్ఞతను నేర్పింది. నాట్యం జీవన గమనాన్ని చూపింది.
 
దేశవిదేశాల్లో...
దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. అంతర్జాతీయంగా యూరోప్, సింగపూర్, ఉత్తర అమెరికా, మలేసియాలో నృత్య ప్రదర్శనలు నిర్వహించాను. చాలా అవార్డులొచ్చాయి. అందులో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అందుకోవడం మరచిపోలేని అనుభూతి.
 
హైదరాబాద్‌తో అనుబంధం..
 హైదరాబాద్ సంస్కృతి విలక్షణమైనది. అది చరిత్రే కాదు.. వర్తమానం కూడా. సౌత్ ఇండియాలో హైదరాబాద్ కల్చర్ చాలా గొప్పది. 2000 సంవత్సరంలో తొలిసారి శిల్పారామంలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చాను. ఇది ఈ నగరంలో నా రెండో ప్రదర్శన. సిటీతో ఈ అనుబంధాన్ని మరచిపోలేను. ఇక్కడ అద్భుతమైన నర్తకీమణులు ఉన్నారు.

Advertisement
Advertisement