వైద్య విద్య.. మిథ్యే! | Sakshi
Sakshi News home page

వైద్య విద్య.. మిథ్యే!

Published Sun, May 3 2015 11:07 PM

వైద్య విద్య.. మిథ్యే!

మెడికల్ కాలేజీల్లో భారీగా పోస్టులు ఖాళీ
టీచింగ్‌కు తప్పని ఇబ్బందులు
ఉస్మానియాలో 458 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 110 ఖాళీ
గాంధీలో 187 పోస్టులకు 30పైగా ఖాళీలు
‘ఎనిమల్‌హౌస్’ లేకుండానే ఉస్మానియాలో పరిశోధనలు
ఎంసీఐ హెచ్చరించినా మెరుగుపడని సౌకర్యాలు


సిటీబ్యూరో: సర్కార్ వైద్య విద్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్యకళాశాలల్లో 910 అసిసె ్టంట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను 224 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఉస్మానియా వైద్యకళాశాలల్లోనే 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన ఫిజియాలజీలో 9, ఎస్‌ఎంపీలో 7, జనరల్ మెడిసిన్‌లో 7, సైక్రియాటిక్‌లో 8, కార్డియాలజీలో 5, గ్యాస్ట్రోఎంటరాలజీలో 3, న్యూరాలజీలో 3, నెఫ్రాలజీలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా సిటీసర్జరీలో 8కి 3, ప్లాస్టిక్ సర్జరీలో 3, పీడియాట్రిక్ సర్జరీలో ఆరు, నియోనాటాలజీలో మూడుకు మూడు పోస్టులు ఖాళీనే. దంత విభాగంలో 43 పోస్టులకు 25, పీడియాట్రిక్ విభాగంలో 31కి తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్లతరబడి నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారు కూడా రాజీనామా చేసి  వెళ్లిపోవడ మే ఇందుకు కారణం. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేయాలని ఎంసీఐ ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉదయం అనుబంధ ఆస్పత్రిలో రోగులను చూసి, మధ్యాహ్నం మెడికల్ కళాశాలలో థీయరీ చెప్పాల్సి వస్తోందని, ఇది తమకు తీవ్ర భారంగా మారుతోందని నీలోఫర్ ఆస్పత్రికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరహరి ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఎంసీఐ హెచ్చరించినా...


ఉస్మానియా వైద్యకళాశాలలో 35 వైద్య కోర్సులు అందిస్తుండగా, 250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, నీలోఫర్ చిల్డ్రన్స్ ఆస్పత్రి, ఛాతి, మానసిక ఆస్పత్రులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, సుల్తాన్ బజార్, పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రులతో పాటు సరోజినిదేవి కంటి ఆస్పత్రి దీనికి అనుబంధంగా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఎంబీబీఎస్ చేసి దేశవిదేశాల్లో గుర్తింపు పొందిన వైద్యులెంతో మంది ఉన్నారు. ఇది గతం. ప్రస్తుతం ఎంసెట్‌లో టాప్‌టెన్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఉస్మానియాకు బదులు గాంధీ వైద్యకళాశాలను ఎంచుకుంటున్నారు. చదువుతున్న కాలేజీకి ప్రాక్టీస్ చేయాల్సిన అనుబంధ ఆస్పత్రులకు మధ్య ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం ఉండటానికి తోడు ఆయా ఆస్పతి భవనాలు, వైద్య పరికరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

విద్యార్థుల నిష్పత్తికి తగిన సెమినార్ హాల్లే కాదు, కాలర్ మైక్‌లు, మరుగుదొడ్లు, గ్రంథాలయం, కీలకమైన జర్నల్స్, ఎగ్జామినేషన్ హాల్, పేపర్ వాల్యూయేషన్ హాల్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇచ్చే మందులు ఎలా పని చేస్తున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి తదితర అంశాలను పరీక్షించేందుకు అవసరమైన ఎనిమల్‌హౌస్ ఏ వైద్య కళాశాల లో కూడా లేకపోవడం విచారకరం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల తనిఖీలు నిర్వహించి ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.
 
ఖాళీలు భర్తీ చేయాలి..

ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న క్వాలిఫైడ్ వైద్యులను టీచింగ్ ఆస్పత్రులకు తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరతను అధి గమించవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. ప్రస్తుతం టీచింగ్ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదం. కమల్‌నాథన్ కమిటీతో సంబంధం లేకుండా అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి తెలంగాణ వైద్యులతో ఖాళీలను భర్తీ చేయాలి. - డాక్టర్ బొంగు రమేష్, గౌరవ అధ్యక్షుడు, టీజీడీఏ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement