ప్రాజెక్టులను అడ్డుకుంటే ప్రజలు తరిమికొడతారు:జూపల్లి | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులను అడ్డుకుంటే ప్రజలు తరిమికొడతారు:జూపల్లి

Published Thu, Jul 21 2016 4:07 AM

ప్రాజెక్టులను అడ్డుకుంటే ప్రజలు తరిమికొడతారు:జూపల్లి - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీడు భూములకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు అడ్డుపడితే ప్రజలు తరిమి కొడతారని మంత్రి జూపల్లి కృష్ణారావు విపక్ష పార్టీలను హెచ్చరించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. జూరాలకు ఎగువ కృష్ణా నుంచి నుంచి జలాలు వచ్చి చే రాయని, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని విడుదల చేసేందుకు గురువారం మోటార్లు ఆన్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పాలమూరు రైతులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

శ్రీశైలం రిజర్వాయరు నిండిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కూడా నీరిస్తామన్నారు. ఈ నాలుగు పథకాల ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జూపల్లి పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని మంత్రి జూపల్లి  అధికారులను ఆదేశించారు. ఇందుకు వారం రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అక్టోబర్ 31లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఉపాధి హామీ పథకంపై సమీక్ష నిర్వహించారు.

Advertisement
Advertisement